Skin Care: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందిస్తాయి. ఎండు ద్రాక్షతో చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అందం కూడా.
పండగల సీజన్ వచ్చేసింది. దసరా, దీపావళి, క్రిస్మస్ ఇలా వరుస బెట్టి వచ్చేస్తున్నాయి. మరి ఈ పండగ వేళ అందరిలో మీరే అందంగా కనిపించాలని కోరుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ మ్యాజికల్ వాటర్ ఉపయోగించాల్సిందే. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలతో కాకుండా మీ వంటింట్లో సులభంగా దొరికే ఎండు ద్రాక్షతో నీటిని చేసుకుని ఉపయోగించడం వల్ల పండగ కళ అంతా మీ మొహంలోనే కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది అందమైన చర్మమే కాదు ఆరోగ్యకరమైన జుట్టు కూడా ఇస్తుంది. రోగనిరోధక శక్తికి, జీవక్రియ సక్రమంగా జరిగేందుకు కూడా ఈ ఎండుద్రాక్ష నీరు దోహదపడుతుంది. ఈ పురాతన ఆరోగ్య, సౌందర్య రహస్యం గురించి తెలుసుకోండి..
ఎండుద్రాక్ష నీళ్ళు ఎందుకు ఆరోగ్యం?
డ్రై ఫ్రూట్స్ లో అధిక పోషకాలు, పుచ్చు పదార్థాలు ఉంటాయి. వాటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆ నీటిలోకి పోషకాలు విడుదల అవుతాయి. ఈ నీటిని తాగడానికి మాత్రమే కాదు ఇతర మార్గాల్లోనూ ఉపయోగించవచ్చు. డ్రై ఫ్రూట్ వాటర్ మంచిదేనా అంటే వందశాతం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ సి, ఎ, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కణాల పునరుత్పత్తిని పెంచడం ద్వారా చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
స్కిన్ కి ఏ విధంగా ఉపయోగం?
ఎండుద్రాక్షలో ఫైటోకెమికల్స్, అమినో యాసిడ్‌లు ఉన్నాయి. సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ నీటిని తాగడం లేదా ఫేస్ ప్యాక్ గా అప్లై చేయడం వల్ల మచ్చలు, మొటిమలు వల్ల ఏర్పడిన స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండుద్రాక్ష నీటిలో మెలటోనిన్ అనే రసాయనం ఉంది. ఇది క్రమం తప్పకుండా వినియోగించినప్పుడు లేదా ఫేస్ కి అప్లై చేసినప్పుడు సహజమైన ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోస్టేట్ సమస్యలకు తగ్గించి నిద్రను ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది.
ఎలా చేసుకోవాలి?
ఎండుద్రాక్ష నీటిని తయారు చెయ్యడానికి ఒక పాత్రలో 2 కప్పుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో సుమారు 100 గ్రాముల ఎండుద్రాక్షని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆ వేడి నీటిలో వేసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగొచ్చు.
ఫేస్ ప్యాక్ గా..
ఎండుద్రాక్ష నీటిని రోజ్ వాటర్ తో కలిపి స్కిన్ టోనర్ గా ఉపయోగించవచ్చు. 1 టీస్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా పసుపు వేసి ఫేస్ మాస్క్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఈ ఎండు ద్రాక్ష నీటిలో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: సన్ ఫ్లవర్ నూనెతో మెరిసే చర్మం మీ సొంతం
Also Read: పెద్దలూ జాగ్రత్త! ఎక్కువగా డీహైడ్రేట్ అయితే మూర్చలు రావొచ్చు