World Sleeping Day: ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే
నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడే వాళ్లు ఎంతో మంది. వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఇట్టే నిద్రపట్టేస్తుంది.
వ్యాయామం, మంచి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి హార్మోన్ల పనితీరు, మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అందుకే రాత్రి మెరుగైన నిద్ర చాలా అవసరం. కానీ ఆధునిక కాలంలో ఒత్తిళ్లు, ఉద్యోగ టెన్షన్ల వల్ల చాలా మందికి సరిగా నిద్రపట్టడం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.
1. శరీరంలో సిర్కాడియన్ రిథమ్ ఉంటుంది. ఇది సహజమైన శరీర గడియారం. మీ మెదడు, శరీరం, హార్లోన్లను ప్రభావితం చేస్తుంది. మెలకువ రావాల్సిన సమయంలో రావడం, నిద్రపోయే సమయం వచ్చినప్పుడు మీ శరీరానికి ఆ విషయం చెప్పడం చేస్తుంది. పగటిపూట సూర్యకాంతి లేదా ప్రకాశవంతమైన కాంతి సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పగటిపూట శక్తిని అందిస్తే, రాత్రి పూట నిద్రనాణ్యతను పెంచుతుంది. కాబట్టి ఉదయం కాంతి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి.
2. వెలుతురు వద్దు
రాత్రి పూట లైట్లు త్వరగానే ఆర్పేయాలి. రాత్రి వెలుతురు సిర్కాడియన్ రిథమ్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మెలటోనిన్ వంటి హార్మోన్లను తగ్గిస్తుంది. దీని వల్ల నిద్ర త్వరగా పట్టదు.
3. కెఫీన్‌కు నో
పగటిపూట కెఫీన్ వల్ల లాభాలు ఉంటాయి. కానీ సాయంత్రం దాటాక కాఫీ, టీ, గ్రీన్ టీ వంటివి తాగకూడదు. ఇందులో ఉండే కెఫీన్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీని వల్ల నిద్ర రాకుండా అడ్డుకుంటుంది.
4. పగటి పూట నిద్రపోవద్దు
రాత్రి ప్రశాంతంగా, నిండుగా నిద్రపోవాలంటే పగటిపూట నిద్రను మానుకోవాలి. పగటిపూట నిద్రపోవడం వల్ల నిద్ర గడియారం గందరగోళానికి గురవుతుంది.
5. ఆల్కహాల్ తాగొద్దు
రాత్రి పూట ఆల్కహాల్ తాగడం వల్ల నిద్ర హార్లోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పానీయం స్లీప్ అప్నియా, గురక, నిద్ర సైకిల్ కు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ ను దూరంగా పెట్టాలి.
6. పడకగది అందంగా...
పడకగది పరిసరాలు కూడా నిద్రను ప్రోత్సహిస్తాయి. వెలుతురు, శబ్ధాలు అధికంగా తెలియకుండా చూసుకోవాలి. ఇవి నిద్ర రాకుండా అడ్డుకుంటాయి.
7. సాయంత్రంకల్లా ప్రశాంతంగా...
ఉదయం ఎన్ని సమస్యలు ఉన్నా నిద్ర సమయానికి వాటన్నింటినీ పక్కన పెట్టేయాలి. రాత్రికి రాత్రే మీరు మిరాకిల్ చేయలేరు కాబట్టి సమస్యలు గురించి మర్చిపోండి. రాత్రికల్లా మనసును ప్రశాంతంగా మార్చుకోండి. హ్యాపీగి నిద్రపోండి.
8. వెచ్చని స్నానం
గోరు వెచ్చని నీళ్లతో రాత్రి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిద్ర సమయానికి గంటన్నర ముందు స్నానం చేస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
9. వ్యాయామం
రోజూ పగటి పూట ఒకే సమయానికి ఓ గంట పాటు వ్యాయామం చేసేందుకు ప్రయత్నించండి. కానీ నిద్ర పోవడానికి ముందు మాత్రం చేయద్దు. వ్యాయామం నిద్ర సమయాన్ని కూడా కాస్త పెంచుతుంది.
10. ద్రవాలు తీసుకోవద్దు
రాత్రిపూట అధిక ద్రవపదార్ధాలు తీసుకోకూడదు. రాత్రిపూట అధిక మూత్రవిసర్జనకు వెళ్లడాన్ని నోక్టురియా అంటారు. ఈ సమస్య వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అందుకే నిద్రపోవడానికి ఒక గంట ముందు నుంచి ఎలాంటి ద్రవాలు తాగకూడదు.
Also read: నిద్రపోకుండా ఎన్ని రోజులు బతకగలరో తెలుసా?
Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది