Weight Loss: థైరాయిడ్ వల్ల బరువు పెరిగిపోయారా? ఈ ఆహారంతో సమస్యలన్నీ పరార్!
థైరాయిడ్ వచ్చిందంటే బరువు పెరిగిపోయి లావుగా కనిపిస్తారు. దాన్ని తగ్గించుకునేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. దీని వల్ల అధికంగా బరువు పెరిగిపోతారు. థైరాయిడ్ తగ్గించుకోవడానికి మందులు అయితే వేసుకుంటారు. కానీ దాని వల్ల వచ్చిన బరువు తగ్గించుకునే దానిపై మాత్రం అంతగా దృష్టి పెట్టరు. ఫలితంగా లావుగా కనిపించడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అందుకే థైరాయిడ్ వల్ల వచ్చిన బరువు తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకుంటూ శరీరానికి శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకుంటూ పోషకాహారాన్ని తీసుకోవాలి. థైరాయిడ్ అనేది ఒక రకమైన ఎండోక్రైన్ గ్రంథి. శరీరానికి కావాల్సిన హార్మోన్లని విడుదల చేయడంతో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాక్సిన్ అనే హార్మోన్లు ఎక్కువ విడుదల చేసిన, తక్కువ విడుదల చేసినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తుంది. ఈ గ్రంథిలో ఏదైనా సమస్య ఉంటే అలసట, జలుబు, జుట్టు రాలడం, ఉన్నట్టుండి బరువు పెరగడం జరుగుతుంది.
థైరాయిడ్ బరువు వల్ల వచ్చే సమస్యలు
- జీవక్రియ నెమ్మదించడం
- శరీరంలో శక్తి తగ్గిపోవడం
- శరీరంలో కొవ్వుని నిల్వ చేయడం, కరిగించడంలో ఆటంకాలు ఏర్పడటం
బరువును తగ్గించే ఆహారాలు
పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు కావాల్సిందల్లా ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా డైట్లో భాగం చేసుకోవడమే.
అయోడిన్: అయోడిన్ వినియోగాన్ని పెంచడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే బరువు తగ్గించుకోవచ్చని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. అందుకే అయోడైజ్డ్ ఉప్పు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి అధికంగా తీసుకోవాలి. అయోడిన్ శరీరానికి తగినంత అందే విధంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. అందుకే అయోడిన్ ఉండే ఆహార పదార్థాలు తినడం చాలా అవసరం.
ఫైబర్ రిచ్ ఫుడ్: ఆరోగ్యంగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఫైబర్ వల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. శరీరంలోని హానికరమైన వ్యర్థాలని తొలగించడం వేగవంతం చేస్తుంది.
విటమిన్ డి: శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైనది విటమిన్ డి. థైరాయిడ్ పనితీరుని నియంత్రించడంలో విటమిన్ డి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ లోపాన్ని అధిగమించేందుకు గుడ్లు, సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలు, మాంసం, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పొందవచ్చు. అందుకే పొద్దున పూట వచ్చే ఎండ శరీరానికి తగిలే విధంగా చూసుకోవాలి.
రాగి: థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయడానికి, జీవక్రియ వేగవంతం చేయడానికి రాగి చాలా అవసరం. బాదం, నువ్వులు, చిక్కుళ్ళు ద్వారా శరీరానికి కావాల్సిన రాగి పొందవచ్చు.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు: బరువు నిర్వహణతో పాటు థైరాయిడ్ గ్రంథి వాపు తగ్గించడంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కీలకంగా వ్యవహరిస్తాయి. వాల్ నట్స్, అవిసె గింజలు, చియా గింజలు, నెయ్యిలో ఒమేగా 3 ఆమ్లాలు పొందవచ్చు.
పండ్లు: యాపిల్స్, బెర్రీలు, అవకాడో తీసుకుంటే థైరాయిడ్ గ్రంథికి మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: విటమిన్-E క్యాప్సుల్‌లోని ఆయిల్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చట, ఇదిగో ఇలా!