Health: ఈ ఐదు నెంబర్లు మీరు ఆరోగ్యంగా ఉన్నారో, లేరో చెప్పేస్తాయ్! అవేంటో చూడండి
మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది హాస్పిటల్ కి వెళ్తేనే తెలుస్తుంది. కానీ వీటి గురించి తెలుసుకుంటే మీరు హాస్పిటల్ కి వెళ్ళే అవసరమే రాదు.
మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ ఈ ఐదు నెంబర్ల గురించి అవగాహన ఉంటే మాత్రం మీ ఆరోగ్యం పదిలంగా ఉన్నట్టే. గతంలో అయితే బీపీ, షుగర్ చెక్ చేయించుకోవడానికి ఖచ్చితంగా హాస్పిటల్స్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ అందరికీ అందబాటులోకి వచ్చింది. ఇంట్లో కూర్చునే డయాబెటిస్ పరీక్ష చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, బీఎంఐ, కేలరీలు ఎంత మేర తీసుకున్నారు అనేది తెలిపే ఐదు నెంబర్ల గురించి మీకు తెలిస్తే చాలు. వాటి ద్వారా మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనేది ఇట్టే తెలుసుకోవచ్చు.
రక్తపోటు 90/60 నుంచి 120/80
చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడే వాళ్ళని చూస్తూనే ఉంటాం. ఎంత ఉంటే బీపీ లేవల్స్ సక్రమంగా ఉన్నాయనేది చాలా వరకు తెలియదు. కానీ ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అధిక రక్తపోటుని హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే గుండె పోటు, స్ట్రోక్స్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రక్తపోటు 90/60 నుంచి 120/80 మధ్య ఉండటం బెటర్.
ఎలా పరిష్కరించాలి: జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానుకోవాలి. ఉప్పు తినడం తగ్గించి బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి.
బ్లడ్ షుగర్ 79 నుంచి 140 కంటే తక్కువ ఉండాలి
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మధుమేహానికి దారి తీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే నరాలు, కళ్ళు దెబ్బతింటాయి. అందుకే వాటిని అదుపులో ఉంచుకునేందుకు సరైన డైట్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కెర స్థాయిలను తగ్గించుకునేందుకు ఇన్సులిన్ ఉపయోగించవచ్చు. ఎక్కువ నీరు త్రాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. బాగా దాహం వేయడం, అలసట, చిరు చెమటలు పట్టడం, దృష్టిలో ఇబ్బంది, అరికాళ్ళ మంటలు వంటి లక్షణాలు కనిపించినా డయాబెటిస్‌గా అనుమానించాలి. వంశపారపర్యంగా ఎవరికైనా మధుమేహం ఉందేమో చూసుకుని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. చక్కెర స్థాయిలు 79 నుంచి 140 లోపు ఉంటే నార్మల్‌గా ఉన్నట్లు.
కొలెస్ట్రాల్ 5 లేదా అంతకంటే తక్కువ
కొలెస్ట్రాల్ అన్నీ విధాలుగా చెడు చేస్తుంది. కొవ్వు ధమనుల్లో పేరుకుపోయి గుండె పోటు లేదా గుండె సంబంధిత జబ్బులకు కారణం అవుతుంది. ఆహార పదార్థాల గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది దీని బారిన పడుతున్నారు. ఇవే కాదు సరిగా వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ధూమపానం, మద్యపానం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటూ కొవ్వు తక్కువగా ఉన్న వాటిని డైట్లో భాగం చేసుకోవాలి. కోలెస్ట్రాల్ స్థాయిలు 5 లేదా అంతకంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.
బీఎంఐ
బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఆరోగ్యకమరమైన బరువుతో ఉన్నారో లేదో తెలుసుకునేది ఇది. వైద్య పరంగా మీరు తక్కువ లేదా ఎక్కువ బరువు ఉన్నారో లేదో ఇది చెప్పేస్తుంది. చాలా ఎక్కువ లేదా తక్కువ BMI కలిగి ఉండటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం దీనికి పరిష్కారం.
కేలరీల మీద అవగాహన
సాధారణంగా మహిళల శరీరానికి 2000 కేలరీలు అవసరం అవుతాయి. అదే పురుషులకి అయితే 2500 కేలరీలు తప్పనిసరిగా కావాలి. కేలరీలు ఆహారం, పానీయాలు మనకి ఇచ్చే శక్తిని కొలవడానికి సహాయపడతాయి. ఇది వయసు, జీవక్రియ, శారీరక శ్రమని బట్టి కూడా మారుతుంది. ఎక్కువ కేలరీలు తీసుకుంటే శరీరం ఆ అదనపు శక్తిని కొవ్వుగా మారుస్తుంది. దాని వల్ల అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి
Also read: ఈ ఐదు పండ్లు మీ అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసేస్తాయ్