Breast Cancer: రొమ్ము క్యాన్సర్ వస్తే కనిపించే సైలెంట్ లక్షణాలు ఇవే
మహిళలను ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది.
మహిళల్లో వచ్చే అత్యంత తీవ్రమైన క్యాన్సర్ రకాల్లో ఒకటి రొమ్ము క్యాన్సర్. 2020లో ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు అంచనా వేశారు. వారిలో ఆరు లక్షల 85 వేల మంది మరణించారు. వీరంతా రొమ్ము క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తించలేకపోయారు. ఈ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రొమ్ము క్యాన్సర్ లక్షణాలను, సంకేతాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి రొమ్ము క్యాన్సర్ అనగానే రొమ్ములు నొక్కినప్పుడు లోపల గట్టిగా ముద్దలా ఏదైనా తగిలితే అది రొమ్ము క్యాన్సర్ సంకేతం గా భావిస్తారు. అదొక్కటే కాదు కొన్ని అసాధారణ లక్షణాలు కూడా ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
లక్షణాలు ఇవే
1. రొమ్ములపై ఉన్న చనుమొనలు ముడుచుకుపోయినట్టు అనిపించినా, లోపలి వైపుకి అణిచినట్టు ఉన్నా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చిందేమోనని అనుమానించాలి.
2. స్కిన్ దింప్లింగ్ అంటే చనుమొనల చుట్టూ ఉన్న చర్మం నారింజ తొక్కలా మారిపోతుంది. అది సాధారణ చర్మంలా ఉండదు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఒక సూచన.
3. రొమ్ములు వేడిగా ఉన్నా, వాపు కనిపించినా అది రొమ్ము క్యాన్సర్ వల్ల కావచ్చు. అలాగే రొమ్ములో నొప్పి కూడా మొదలవుతుంది.
4. చనుమొనల నుండి రక్తంతో కూడిన ద్రవం వస్తున్నా, ఇతర స్రావాలు ఏమైనా వస్తున్నా కూడా అది క్యాన్సర్‌కు సంకేతమే.
5. నొక్కినప్పుడు గడ్డ లాంటివి తగిలితే ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. రొమ్ము నుంచి శోసరస కణుపులకు (లింఫ్ నోడ్స్)కి క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఊపిరితిత్తులకు, కాలేయానికి, మెదడుకు, ఎముకలకు కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వీటిని దీనిని తేలికగా తీసుకోకూడదు.
రాకుండా ఉండాలంటే..
ఎక్కువ కాలం పాటు పిల్లలకు తల్లిపాలు ఇస్తే ఆ మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెప్పాయి. అలాగే శ్రమ అధికంగా చేసేవారిలో, బరువును నియంత్రణలో ఉంచుకునే వారిలో, మద్యపానం తాగని వారిలో, పొగాకును దూరంగా ఉండే వారిలో కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. అధిక రేడియేషన్ గురయ్యే వారిలో రొమ్ము క్యాన్సర్ త్వరగా వస్తుంది. దానిమ్మ పండ్లను తరచూ తినాలి. ఇందులో ఇల్లజిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. రోజూ అరగ్లాసు జ్యూస్ తాగడం ఉత్తమం. ఆక్రోట్లు కూడా రోజూ తినడం అలవాటు చేసుకోవాలి.
Also read: ఈ రెండు రకాల ఆహారాలు తినడం మానేస్తే చాలు డయాబెటిస్ అదుపులో ఉండడం ఖాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.