Heart Health: గుండె ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆరు ముఖ్యమైన అంశాలు ఇవే
హార్ట్ ఎటాక్ బారిన పడడానికి దారి తీసే ముఖ్యమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి.
గుండె వైఫల్యం అనేది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. గుండె వైఫల్యం అంటే గుండె శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేయలేకపోవడం. ఇది దీర్ఘకాలిక సమస్యల వల్ల జరుగుతుంది. చికిత్స చేయకపోతే సమస్య పెద్దదిగా మారి ప్రాణాంతక సమస్య అవుతుంది. శరీరం పనితీరు చక్కగా ఉండాలన్నా, శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందాలన్నా, గుండె అవయవాలకు రక్తాన్ని పంపించాలి. అలా పంపు చేయలేని పక్షంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. శరీరంలోని అవయవాలకు రక్తాన్ని సరిగ్గా పంపు చేయలేకపోతే, రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి శ్వాస తీసుకువడంలో ఇబ్బంది కలగడం, బలహీనంగా మారడం, రోజువారీ కార్యాకలాపాలు కూడా చేసుకోలేకపోవడం వంటివి జరగవచ్చు. ఇది తీవ్రమైతే మరణం సంభవించే అవకాశం ఉంది.
గుండె ఆగిపోవడం అనే సమస్య కరోనారీ వ్యాధి వల్ల కూడా వస్తుంది. ఇది గుండెకు రక్తం, ఆక్సిజన్ సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించేలా చేసి రుగ్మత ఇది. అయితే మధుమేహం, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, థైరాయిడ్, అధిక రక్తపోటు వంటివి కూడా గుండె వైఫల్యాన్ని పెంచుతాయి. బలహీనమైన గుండె కలిగిన రోగులు ఈ ఆరోగ్య సమస్యల కారణంగా చిక్కుల్లో పడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
కరోనరీ ఆర్టరి వ్యాధి
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది. గుండె కండరాలు దెబ్బ తినడానికి ఇది దోహదపడుతుంది. చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
అధిక రక్తపోటు
ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్న సమస్య ఇది. అదుపులో ఉండకపోతే గుండె కండరాలకు దెబ్బ పడుతుంది. రక్తాన్ని సమర్థవంతంగా పంపు చేయలేక గుండె వైఫల్యానికి కారణమవుతుంది.
డయాబెటిస్
ఎంతోమంది డయాబెటిస్ బారిన పడినవారు ఉన్నారు. వీరిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే రక్తంలో అధిక స్థాయి గ్లూకోజ్ ఉన్నప్పుడు రక్తనాళాలు గుండె కండరాలు దెబ్బతింటాయి.
హార్ట్ వాల్వ్ డిసీజ్
గుండె కవాటాలు దెబ్బ తినడం లేదా అవి సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తప్రసరణ అవయవాలకు సరిగా జరగదు. అలాంటప్పుడు గుండె పనితీరు చాలా మేరకు తగ్గిపోతుంది. చివరికి గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
కార్డియో మయోపతి
ఇది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. గుండె ఉబ్బడం వల్ల సమస్య వస్తుంది. రక్తాన్ని సమర్ధంగా పంపు చేయలేక కుదేలు పడుతుంది. అనారోగ్యకరమైన ఆహారాలు తినడం, ధూమపానం అధికంగా చేయడం, మద్యాన్ని అధికంగా సేవించడం, ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
Also read: నా భార్య కొడుతోంది, ఈ సమస్య ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.