(Source: ECI/ABP News/ABP Majha)
Relationships: నా వివాహంలో ప్రేమ లేదు, అందుకే నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది
భర్త ప్రేమను పొందలేకపోతున్నానని మరొక వ్యక్తితో ప్రేమలో పడిన వివాహిత జీవితం ఇది.
ప్రశ్న: మా వివాహమై ఆరేళ్లు దాటింది. పెద్దల కుదిర్చిన వివాహం మాది. కానీ మా వివాహానికి ఎప్పుడూ నిండుదనం రాలేదు. నాపైన భర్త ఎప్పుడు ప్రేమ చూపించలేదు. ప్రేమలేని జీవితంతో నేను చాలా నిస్సారమైన లైఫ్‌ని బతుకుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లోనే మా ఇంట్లో అద్దెకి వచ్చిన వ్యక్తి నాపై ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. ప్రేమలేని నా జీవితంలో అతను చూపించిన ఎఫెక్షన్ నాకు ఎక్కువగా కనిపించింది. మనసు తప్పని చెబుతున్న అతనికి కనెక్ట్ అయ్యాను. మేము తరచూ నా భర్త ఇంట్లో లేని సమయంలో కలుస్తూ ఉన్నాము. ఓరోజు మా ఇద్దరం కలిసి ఉండగా మా అత్తగారు చూశారు. దీంతో నాకు భయం వేసి నా పుట్టింటికి వచ్చేసాను. నా భర్తకి ఆమె నా విషయం చెప్పిందో లేదో నాకు తెలియడం లేదు. ఇంతవరకు ఆయన నన్ను అడగలేదు. మా అత్త కూడా నన్ను ఏమీ ప్రశ్నించలేదు. నా భర్తతో నా పెళ్లి ముగిసిపోవడం నాకు ఇష్టం లేదు. అతను నాకు ఇవ్వని ప్రేమను ఈ వ్యక్తి ద్వారా పొందడానికి చూశాను. అది నేను చేసిన తప్పే, కానీ నా పెళ్లి త్వరగా ముగిసిపోతుందేమోనని భయమేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
జవాబు: మీరు చేసింది చాలా పెద్ద తప్పు. భర్త దగ్గర ప్రేమ కరువైందని బయట ప్రేమను వెతుక్కున్నారు. అదే పని మీ భర్త చేసి ఉంటే... మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి ఊహించుకోండి. భర్త ప్రేమ అందించకపోతే మీరు ఆయనకు అందించండి, ఆయన మీ దారిలోకి వచ్చేలా ఆపేక్షను, ప్రేమను చూపించండి. మీ దగ్గర ఉన్న ప్రేమను బయట వ్యక్తికి పెంచే బదులు, మీ పిల్లలు, మీ అత్త మామ లకు పంచితే బాగుండేది. కానీ మీరు కోరుకున్నది ప్రేమ కాదు... ఇంకేదో. అది మీ మనసును అడగండి. ప్రేమే కావాలి అనుకుంటే బయట వ్యక్తులకు దగ్గర కావాల్సిన అవసరం లేదు. వారితో శారీరకంగా అనుబంధం పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థం అయ్యే ఉండాలి.
సొంత కోడలిని వేరే వ్యక్తితో చూసిన ఆ అత్త గుండె పగిలిపోయి ఉంటుంది. ఆమె ఎంత అసౌకర్యంగా ఫీల్ అయి ఉంటుందో ఊహించుకోండి. ఆమె ఇంతవరకు తన కొడుకుకి చెప్పలేదంటే తన కొడుకు కోడలు ఆనందంగా ఉండాలని ఆమె కోరుకుంటున్నట్టే. కోడలిపై పగ తీర్చుకోవాలి, కోడల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునే వ్యక్తి అయితే ఈపాటికి పెద్ద గొడవ జరిగి ఉండేది. ఇంకా ఆమె తన కొడుక్కి చెప్పకుండా ఆలోచిస్తుందంటే మీ బంధం తెగిపోకూడదని ఆమె కోరుకుంటున్నట్టే. అలాగే ఈ విషయం తెలిస్తే తన కొడుకు ఏమైపోతాడో అని కూడా ఆమె కలత చెందుతూ ఉంటుంది. మీరు మీ ఇంటిల్లిపాది దగ్గర నిజాయితీని కోల్పోయారు, అందరినీ మోసం చేశారు.
వచ్చి పుట్టింట్లో దాక్కోవడం కన్నా వెళ్లి మీ అత్తగారితో మాట్లాడండి. చేసింది తప్పేనని మరొకసారి ఇలాంటి పని చేయనని చెప్పండి. వైవాహిక జీవితంలో సంతోషం లేకపోవడం వల్ల ఇలా చేశానని, అలా చేయడం తప్పేనని తెలుసుకున్నానని చెప్పండి. మీరు ముందుగా మీ అత్తగారితో మాట్లాడడం ముఖ్యం. మీ వల్ల మీ పిల్లల భవిష్యత్తు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు చేయడం వల్ల మీ జీవితంతో పాటు ఎంతోమంది జీవితాలు తలకిందులు అవుతాయి. మీకు మీ భర్త దగ్గర ప్రేమ కరువైతే వేరే వాళ్ల దగ్గర వెతుక్కోమని కాదు, అతనిని మీ ప్రేమబంధంలోకి లాక్కోవడానికి ప్రయత్నించాలి. మీ కాపురం కూలిపోకుండా ఉండాలంటే మీరు మీ అత్తతో ముందుగా మాట్లాడండి. ఇతర సంబంధాలు వెంటనే వదిలేయండి.
Also read: డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ