(Source: ECI/ABP News/ABP Majha)
ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు
ఒక వ్యక్తికి విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఇలాంటి వ్యాధి బయటపడడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
ఆధునిక కాలంలో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు బయటపడుతున్నాయి. అలాంటిదే ఒకటి మొట్టమొదటి సారిగా బయటపడింది. కోల్‌కతాలోని ఒక వ్యక్తికి మూడు నెలల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అతని గొంతు బొంగురు పోయింది. కారణం తెలుసుకునేందుకు వైద్యులను కలిశారు. వారు ఎండోస్కోపీ ద్వారా పరీక్షించారు. ఆ పరీక్షలో వారికి గొంతులో చిన్న మొక్కల్లాంటి ఆకారాలు కనిపించాయి. అవి ఫంగస్ అని తేల్చారు వైద్యులు. ఈ వైద్య నిపుణులు జర్నల్ మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్‌లో దాని గురించి వ్రాశారు. ఆ రోగికి 61 ఏళ్ల వయసు. అతను దగ్గు, అలసట, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలతో... మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్నాడు. ఇవన్నీ మొక్కల్లోని శిలీంధ్రాల వల్ల అయినట్టు గుర్తించారు.
అరుదైన ఈ ఫంగల్ వ్యాధితో బాధపడుతున్న రోగి ‘అనోరెక్సియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆయనకు మూత్రపిండ వ్యాధి, మధుమేహం, HIV వంటి సమస్యలు లేవు. దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర కూడా లేదు.అయితే ఈ వ్యాధి ఆయనకు మొక్కల నుంచి సోకినట్టు అనుమానిస్తున్నారు వైద్యులు. అతను తన పరిశోధన కోసం క్షీణిస్తున్న పుట్టగొడుగులు, ఇతర మొక్కల శిలీంధ్రాలతో పనిచేసే ఒక మైకాలజిస్ట్. ఆ శిలీంధ్రాలు చేతుల ద్వారా శరీరంలో చేరినట్టు భావిస్తున్నారు. ఆ శిలీంధ్రాల పేరు కొండ్రోస్టెరియం పర్పురియం. ఈ శిలీంధ్రాలే గొంతులో చేరి మొక్కల్లా మొలిచేశాయ్.
కొండ్రోస్టెరియం పర్పురియం అంటే ఏమిటి?
కొండ్రోస్టెరియం పర్పురియం అనేది మొక్కల శిలీంధ్రం. ఇది మొక్కలలో, ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన వాటిలో వెండి ఆకుల వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి కేవలం మొక్కలకు మాత్రమే వస్తుందని అనుకున్నారంతా కానీ ఇప్పుడు తొలిసారి మానవులలో గుర్తించారు. ఈ వ్యాధి నిర్ధారణలో మైక్రోస్కోపీ, కల్చర్ ఫంగస్‌ను గుర్తించడంలో విఫలమైందని వైద్యులు చెబుతున్నారు. అప్పుడు సీక్వెన్సింగ్ పద్ధతిలో ఈ అరుదైన వ్యాధిని గుర్తించారు.ఆ రోగికి ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. యాంటీ ఫంగల్ మందులను సూచించారు.
ఈ వ్యాధి గురించి వైద్యులకు తక్కువ తెలుసు. ఇది వ్యాప్తి చెందుతుందా లేదా, ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అనే విషయాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా మొక్కలతో పరిశోధనలు చేసే వారంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మొక్కలు పెంచేవాళ్లు, నర్సరీలోని పనివాళ్లు, రైతులు కూడా ఇలాంటి మొక్కల శిలీంధ్రాలు శరీరంలో చేరకుండా చూసుకోవాలి. మొక్కల నుంచి కూడా మానవులకు శిలీంధ్రాలు సోకడం మానవాళిని ఇబ్బంది పెట్టే సమస్యా.
Also read: రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.