Neera Drink: తెలంగాణ సాంప్రదాయ పానీయం నీరా - కల్లుకు, నీరాకు మధ్య తేడా ఏంటి?
నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే నీరా కేఫ్ హైదరాబాదులో ప్రారంభమైంది.
పోషక విలువలతో నిండిన సాఫ్ట్ డ్రింక్ నీరా. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అందుకే తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ అండ్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. నెక్లెస్ రోడ్ లో ఈ నీరా కేంద్రం ఏర్పాటయింది. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి నీరా కేఫ్. ఆ పానీయానికి అంత ప్రాధాన్యతను ఎందుకిస్తున్నారు? అసలు ఏంటది? కల్లు, నీరా ఒక్కటేనా?
ఏంటి ఈ నీరా?
నీరా అనేది ఒక పానీయం. తాటి చెట్టు నుంచి దీన్ని తీస్తారు. తాటి చెట్టు గెలల నుంచి ద్రవం స్రవిస్తుంది. అదే నీరా. దీన్ని సేకరించి పులియబెడితే కల్లుగా మారుతుంది. పులియకుండా సేకరిస్తే అది నీరా. దీన్ని సూర్యోదయానికి ముందే తాటి చెట్టు నుంచి సేకరిస్తారు. ఎంతో రుచిగా, పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని హెల్త్ డ్రింక్‌గా భావిస్తారు. కల్లులో మత్తు ఇచ్చే లక్షణాలు ఉంటాయి. కానీ నీరాలో అలాంటి లక్షణాలు ఏమీ ఉండదు. ఆల్కహాల్ కంటెంట్ జీరో శాతం. అందుకే దీన్ని ఎవరైనా తాగొచ్చు.
నీరా పానీయాన్ని ఎక్కువ రోజులు పాటు నిల్వ చేయలేరు. చాలా త్వరగా ఇది పాడైపోతుంది. అందుకే తెలంగాణ నీరా తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ రెండున్నర ఏళ్లుగా కష్టపడి నీరాను శాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో కనిపెట్టింది. అందుకే ఇప్పుడు నీరా కేఫ్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.
నీరా ఆరోగ్య పానీయం. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పచ్చకామెర్లు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా నీరాను తాగొచ్చు. అమినో ఆమ్లాలు, విటమిన్ సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పానీయం ఇది. శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్. వేసవిలో నీరా తాగితే వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను తీరుస్తుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. నీరాలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. సహజ పానీయాల్లో ఒకటైనా నీరాను పిల్లలు, పెద్దలు కూడా తాగవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా నీరా పానీయం గురించిన ప్రస్తావన ఉంది.
Also read: నా భార్య రోజంతా టీవీ చూస్తూ నా చేతే పనులు చేయిస్తోంది, నాకేమో చెప్పే ధైర్యం లేదుః
Also read: పచ్చి మామిడితో ఇలా చట్నీ చేస్తే దోశె, ఇడ్లీలోకి అదిరిపోతుంది - వేసవి తాపం తగ్గుతుంది కూడా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.