Tomato Ravva Dosa Recipe : ఇన్స్టాంట్ టొమాటో రవ్వ దోశ.. పదినిమిషాల్లో టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
Instant Dosa Recipe : దోశలంటే ఇష్టమా? అయితే మీరు టొమాటో రవ్వదోశను ట్రై చేయాల్సిందే. పైగా దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా ఈ దోశలు చేసుకుని ఆస్వాదించేయవచ్చు.
Tasty Tomato Ravva Dosa : దోశలకు పిండి నానబెట్టకపోయినా.. ఆఫీస్‌కి లేట్ అవుతుందని త్వరగా ఏదైనా తినాలనిపించినా.. లేదంటే దోశలే తినాలనిపించినా ఇంట్లోనే టొమాటో దోశలు చేసుకోవచ్చు. అదేంటి దోశల్లో టొమాటో పచ్చడి వేసుకుని కదా తింటాము.. టొమాటో దోశలేంటి అనుకుంటున్నారు. అదే అసలైన మ్యాజిక్. టోమాటో రవ్వ దోశలను తయారు చేయడం చాలా తేలిక. కేవలం పదినిమిషాల్లో మీరు టొమాటో దోశలు చేసి హాయిగా లాగించేయవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
టొమాటో ముక్కలు - 1 కప్పు
అల్లం - ఒక అంగుళం
బియ్యం పిండి - అరకప్పు
రవ్వ - అరకప్పు
ఉప్పు - రుచికి తగినంత
కారం - అర టీస్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - పావు టీస్పూన్
కొత్తిమీర - గుప్పెడు
నీళ్లు - రెండున్నర కప్పులు
నూనె - దోశలకు సరిపడా
తయారీ విధానం
ముందుగా టొమాటోలను బాగా కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని.. అల్లం ముక్కలు వేయాలి. దానిలోనే కారం.. ఉప్పు కూడా వేసి మిక్సీ చేయాలి. మిక్సింగ్ బౌల్లోకి ఈ టొమాటో ప్యూరీని తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి, రవ్వ వేసి కలపాలి. అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అనంతరం రెండున్నర గ్లాసుల నీళ్లు వేసి పిండిని మరోసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
రవ్వదోశకి పిండి ఎలా పలుచగా ఉంటుందో.. ఇది కూడా అదే మాదిరిగా ఉంటుంది. నీళ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి పిండి పలుచగా ఉంటుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై నూనె రాయండి. అనంతరం రవ్వదోశను ఎలా వేసుకుంటామో దీనికి సేమ్ ప్రాసెస్‌ను ఫాలో అవ్వాలి. గుంట గరిటెను తీసుకుని.. పిండిని బాగా కలిపి.. దానిని గరిటలోకి తీసుకోవాలి. పెనం వేడెక్కిన వెంటనే పిండిని పోసుకోవాలి. మధ్యలో వచ్చిన ఖాళీలను ఈ పిండిని పోస్తూ నింపుకోవాలి.
దోశ చుట్టూ, దోశ మీద నూనె వేసుకుని 5 నిమిషాయులు ఉడికించుకోవాలి. అనంతరం దానిని ఉల్టా తిప్పి మరికొంత సేపు ఉడకనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ టొమాటో దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో హాయిగా లాగించేయవచ్చు. ముఖ్యంగా బొంబాయి చట్నీతో ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అంతే. ఈ దోశలను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇన్‌స్టాంట్‌గా దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్.
Also Read : కాఫీలో నిమ్మకాయ కలిపి తాగొచ్చా? లాభాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? నిపుణుల సూచనలు ఇవే
అంతేకాకుండా స్కూల్స్, ఆఫీస్లకోసం హడావుడిగా రెడీ అయ్యే సమయంలో మీ దోశ క్రేవింగ్స్‌ని తగ్గించుకోవడానికి కూడా ఈ టేస్టీ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ టేస్టీ దోశలను చేసి హాయిగా లాగించేయండి.
Also Read : టేస్టీ, క్రిస్పీ బూందీ మిఠాయి.. బెల్లం బూందీ అచ్చుని ఇంత సింపుల్‌గా చేసేయొచ్చా?