Bellam Achu Recipe : టేస్టీ, క్రిస్పీ బూందీ మిఠాయి.. బెల్లం బూందీ అచ్చుని ఇంత సింపుల్‌గా చేసేయొచ్చా?
Dussehra 2024 Recipes : తెలుగువారికి బూందీ మిఠాయి, బెల్లం బూందీ అచ్చు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్వీట్‌ని.. స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయొచ్చో ఇప్పుడు చూసేద్దాం.
Bellam Boondi Mitai Recipe : పండుగల సమయంలో పిల్లలు ఇష్టంగా తినే వంటల్లో బూందీ మిఠాయి కచ్చితంగా ఉంటుంది. దీనినే బెల్లం బూందీ అచ్చు అని.. కరకజ్జ అని కూడా అంటారు. అయితే దీనిని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తెలుసా? పైగా దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఈ దసరా 2024 (Dussehra 2024)పండక్కి మీరు కూడా దీనిని సింపుల్‌గా చేసేయొచ్చు. మరి ఈ టేస్టీ, క్రిస్పీ బూందీ మిఠాయిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
తయారీ విధానం
శనగపిండి - రెండు కప్పులు
ఉప్పు - చిటికెడు
నీళ్లు - వంటకు సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
వంటసోడా - రెండు చిటికెడులు
బెల్లం - ఒకటిన్నర కప్పులు
నీళ్లు - పావు కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి. దానిలో సాల్ట్ వేసి కలపాలి. అనంతరం నీటిని వేసి కలపాలి. నీరు కొద్ది కొద్దిగా వేస్తూ.. పిండి మరీ పలుచగా కాకుండా.. మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. ముఖ్యంగా ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో వంట సోడా లేదంటే ఓ టీస్పూన్ నూనె వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి గుళ్లగా వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి స్టౌవ్ వెలిగించి దానిపై కడాయిని పెట్టాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.
నూనె వేగిన తర్వాత.. బూందీ జల్లెడ తీసుకుని.. దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి.. జల్లెడను కొడుతుంటే.. నూనెలో అది బూందీ మాదిరిగా చిన్నచిన్నగా పడుతుంది. ఈ బూందీని మంచిగా వేయించుకోవాలి. మంటను మీడియంలోనే ఉంచుకోవాలి. బూందీ కరకరలాడేలా వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం పిండితో బూందీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి మందపాటి కడాయిని పెట్టండి. దానిలో బెల్లం వేయాలి. రెండు కప్పుల శనగపిండికి.. ఒకటిన్నర కప్పుల బెల్లం తీసుకోవాలి. దానిలో ఓ పావు కప్పు నీటిని వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లంలో మలినాలు ఏమైనా ఉంటే వడకట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని మంచి పాకం అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. పాకం ఎలా ఉండాలంటే.. నీటిలో వేస్తే.. బెల్లం గట్టిగా అవ్వాలి. పాకం అలా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి పాకం సిద్ధమైతే దానిలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి మీకు వద్దంటే మానేసినా పర్లేదు. కానీ వేసుకుంటే బాగుంటుంది.
ఇలా తయారు చేసుకున్న బెల్లం పాకంలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బూందీని సగం వేసి కలపాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి మిగిలిన బూందీ వేసి కలపాలి. బూందీ వేసిన తర్వాత బెల్లం కలిసేలా.. గరిటతో స్పీడ్‌గా కలపాలి. పాకం సిద్ధమయ్యే సమయంలో ప్లేట్‌కి నెయ్యి లేదా నూనె రాసి పక్కనపెట్టుకోవాలి. ఈ ప్లేట్లో తయారైన బూందీ మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి. దానిని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారక ముందే కత్తితో దానిని నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత దానిని ప్లేట్నుంచి వేరు చేయాలి. ముందుగానే గాటు పెట్టుకోవడం వల్ల మిఠాయి నచ్చిన షేప్‌లో వస్తుంది. అంతే టేస్టీ, క్రిస్పీ బూందీ మిఠాయి రెడీ. దీనిని ఎక్కువగా పండుగల సమయంలో చేసుకుంటారు. అయితే పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు కాబట్టి రెగ్యూలర్‌గా కూడా చేసి పెట్టుకోవచ్చు. బూందీని వేయించుకునే సమయంలో గుప్పెడు పల్లీలు కూడా వేసుకుని పాకంలో వేసి కలుపుకుంటే దాని రుచి వేరే లెవల్లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ రెసిపీని చేసుకుని లాగించేయండి.
Also Read : టేస్టీ కొబ్బరి లౌజ్లు, నోరూరించే రవ్వ లడ్డూలు.. సింపుల్, టేస్టీ రెసిపీలు ఇవే