Potlam Idly Recipe : కేరళ స్టైల్ పొట్లం ఇడ్లీ.. రెసిపీ చాలా ఈజీ.. దీనితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
Potlam Idli Recipe in Telugu : అందం, ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు.. మంచి రుచిని ఆస్వాదించాలనుకుంటే.. పొట్లం ఇడ్లీ, కొబ్బరి చట్నీని ట్రై చేయాల్సిందే. వీటిని చేయడం చాలా ఈజీ.
Kerala Style Healthy Breakfast : జుట్టుకు, ఆరోగ్యానికి హెల్ప్ చేసే కేరళ స్టైల్ పొట్లం ఇడ్లీని ఎప్పుడైనా తిన్నారా? కానీ ఒక్కసారి తింటే దీని రుచి మిమ్మల్ని విడువదు. అంత మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి, బ్యూటీకి ఎన్ని ప్రయోజనాలు ఇస్తుంది. మరి హెల్తీ పొట్లం ఇడ్లీని ఎలా తయారు చేయాలి? దీనిలోకి ఏ చట్నీ బాగుంటుంది? ఈ డెడ్లీ బ్రేక్‌ఫాస్ట్ కాంబినేషన్‌ని ట్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - రెండు గ్లాసులు
ఇడ్లీరవ్వ - నాలుగు గ్లాసులు
సోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
పనస ఆకులు - ఇడ్లీలకు కావాల్సినన్ని
టూత్ పిక్స్ లేదా చీపురు పుల్ల - ఇడ్లీలకు కావాల్సినన్ని
చట్నీకోసం
కొబ్బరి - 1 కప్పు
పచ్చిమిర్చి - 12
వెల్లుల్లి - 5 రెబ్బలు
చింతపండు - కొంచెం
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - ఫ్రై చేసుకోవడానికి సరిపడేంత
తయారీ విధానం
ఇడ్లీ కోసం పిండిని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. మినపప్పును ఉదయం నానబెట్టుకోవాలి. లేదంటే ఓ 5 గంటలు నానినా సరిపోతుంది. సాయంత్రం ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. రవ్వ ఓ గంట నానిన తర్వాత మినపప్పును మిక్సీ చేసుకోవాలి. పిండిని జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి. దీనిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని.. దానిలో ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా పిండుకుని.. మినపపిండిలో వేయాలి. ఇప్పుడు దానిలో తగినంత ఉప్పు వేసుకుని.. రవ్వ.. మినపపిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిని రాత్రంతా పులియబెట్టాలి.
ఉదయాన్నే ఫ్రెష్ పనస ఆకులను తెచ్చుకోవాలి. వాటిని బాగా కడిగి.. ఆకులకు సరిపడినన్ని టూత్ పిక్స్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పనస ఆకులను పొట్టాలుగా చుట్టి.. వాటికి టూత్ పిక్ పెట్టాలి. అప్పుడు ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు వాటిలో ఇడ్లీ పిండిని వేయాలి. దానికంటే ముందు కాస్త సోడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పొట్లంలో వేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాలను ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి పొట్లం ఇడ్లీ రెడీ.
చట్నీ కోసం..
కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో కాస్త నూనె వేసి.. జీలకర్ర వేసి వేయించుకోవాలి. అప్పుడు దానిలో పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. అవి వేగుతున్న సమయంలో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. దానిలో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అనంతరం దానిలో చింతపండు గుజ్జు, తగినంత నీరు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అంతే చట్నీ సిద్ధం.
ఈ పొట్లం ఇడ్లీలకు.. కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్. పైగా ఈ రెండూ కూడా బ్యూటీ, హెల్త్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. పనస ఆకుల్లోని సారం.. ఇడ్లీలకు అంది.. మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది గుండెకు, జుట్టుకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే కొబ్బరి కూడా జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నోప్రయోజనాలు అందిస్తుంది. అందుకే ఈ హెల్తీ కాంబినేషన్‌ను మీరు కూడా ట్రై చేసేయండి.
Also Read : బరువును తగ్గించే మిల్లెట్స్ దోశలు.. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కోసం ఈ రెసిపీని ఫాలో అయిపోండి