Pesarattu Recipe : మూడు ముక్కల పెసరట్టు.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ అన్నట్టు
Telugu Breakfast Recipes : పెసరట్టు అంటే చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా మూడు ముక్కల పెసరట్టును ఏ విధంగా చేయాలో తెలుసా?
Tasty Breakfast : పెసరట్టు అంటే ఇష్టమా? దీనిని మీరు బయటకెళ్లి కాదు ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమి పడకుండా.. ఇంట్లోనే కొన్ని పదార్థాలతో.. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ రెసిపీని తయారు చేసుకుంటే మూడుముక్కల పెసరట్టు మీ ప్లేట్లో ఉంటుంది. అయితే ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో? ఏ టిప్స్ ఫాలో అయితే పెసరట్టు మరింత టేస్టీగా వస్తుందో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పెసలు - రెండు కప్పులు
బియ్యం - అరకప్పు
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2
అల్లం - అంగుళం
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - 1 స్పూన్
నూనె - పెసరట్టుకి తగినంత
తయారీ విధానం
పెసలు, బియ్యాన్ని బాగా కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని బాగా కడిగి.. మిక్సీలో వేసి మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. అయితే ఉదయాన్నే మాకు సమయం ఉండదు అనుకునేవారు పెసలు మధ్యాహ్నం నానబెట్టుకుని పిండిని తయారు చేసుకోవాలి. అయితే దీనిని దోశ పిండిలాగ బయట ఉంచకుండా ఫ్రిజ్లో ఉంచాలి. అయితే రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే రుబ్బుకున్న పిండితో వచ్చే టేస్ట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.
పిండిని సిద్ధం చేసుకున్న తర్వాత దానిలో ఉప్పు కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తీసుకుని బాగా కడిగి.. వాటిని చిన్నచిన్న ముక్కలుగా కోయండి. పచ్చిమిర్చిని రౌండ్గా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పెనం పెట్టండి. పెనం వేడెక్కిన తర్వాత దానిపై పెసర పిండిని వేసి దోశలాగ తిప్పండి. దానిపై అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి. దానిపై కాస్త జీలకర్ర కూడ వేయండి.
అట్టు రోస్ట్ అయ్యేందుకు తగినంత ఆయిల్ వేయండి. ముక్కలు ఊడిపోకుండా.. అట్లకాడతో వాటిని మెత్తగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు దోశను అంటుకుని ఊడిపోవు. అట్టు కిందవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పి కాస్త రోస్ట్ కానిచ్చి తీసేయాలి. అంతే వేడి, టేస్టీ పెసరట్టు రెడీ. దీనిని మీరు పల్లీ చట్నీ లేదా.. అల్లం చట్నీ కాంబినేషన్తో లాగించేయవచ్చు. ఉదయాన్నే ప్రోటీన్ ఫుడ్ కావాలనుకునేవారు కూడా దీనిని బేషుగ్గా తీసుకోవచ్చు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని హాయిగా తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్కు ఇది మంచి సోర్స్. దీనిలోని అల్లం, జీలకర్ర వంటివి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. మధుమేహమున్నవారు కూడా వీటిని హాయిగా లాగించవచ్చు. టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూడు ముక్కల పెసరట్టును మీరు కూడా వేసేయండి. మీరు దీనిని ఉప్మాతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇదే విధంగా పెసరట్టు వేసి.. దానిపై తయారు చేసుకున్న ఉప్మాను వేసుకుని రోల్ చేస్తే సరి. ఉప్మాతో పెసరట్టు తింటే మీకు చట్నీ కూడా అవసరం ఉండదు.
Also Read : బ్యాటర్ ఒకటే రెసిపీలు రెండు.. ఇన్స్టాంట్ ఇడ్లీలు, దోశలు ఇలా చేసేయండి