Heart Attack: డేంజర్ స్లీప్.. గురక గుండెను ఆపేస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
గురకను సరదాగా తీసుకోకండి. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా గురక సమస్య ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే నిద్రలోనే ప్రాణాలు వదిలేసే ప్రమాదం ఉంది.
గురక పెట్టేవారిని చూస్తే.. ‘‘అతడు బాగానే హాయిగా గురక పెట్టి నిద్రపోతున్నాడు. మనకి నిద్రలేకుండా చేస్తున్నాడు’’ అని విసుక్కుంటాం. కానీ, ఆ గురక వెనుక ఉన్న అసలు సమస్యను మాత్రం ఎవరూ గుర్తించలేరు. గురక కొందరిని నవ్విస్తుంది. మరికొందరికి విసుగు తెప్పిస్తుంది. అనోన్య దంపతులను సైతం విడదీసే శక్తి ‘గురక’కు ఉంది. మీ ఇంట్లో ఎవరైనా గురక పెడుతుంటే.. వారిని ఎగతాళి చేయకండి. వీలైతే అతడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లండి. ఒక వేళ మీరే గురక సమస్యను ఎదుర్కొంటుంటే.. ఈ కింది లక్షణాలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి.
గురక పెట్టేవారు ఒక్కోసారి నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొంటారు. ఆ తర్వాత మళ్లీ నిద్రపోవడానికి చాలా ఇబ్బందిపడతారు. ఈ లక్షణాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, గురక ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) హెచ్చరిస్తోంది.
AHA తెలిపిన వివరాల ప్రకారం.. మీరు నిద్రపోతున్నప్పుడు మీ గొంతులోని రిలాక్స్డ్ టిష్యూల మీదుగా ప్రయాణించే గాలి శబ్దమే ‘గురక’. ఇది ‘స్లీప్ అప్నియా’ సమస్యకు దారి తీస్తుంది. స్పీల్ అప్నియా వల్ల శ్వాసక్రియ ఆగుతూ ఆగుతూ సాగుతుంది. అయితే, గురక పెట్టే ప్రతి ఒక్కరికీ ‘స్లీప్ అప్నియా’ రాకపోవచ్చు. కానీ, ఆ సమస్య ఉన్నవారు మాత్రం నిత్యం గురక పెడతారు. కాబట్టి.. ఈ సమస్య ఉందో లేదో నిర్ధరించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఐదుగురు పెద్దల్లో ఒకరు స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఏహెచ్ఏ నివేదికలో పేర్కొంది.
స్లీప్ అప్నియాను ఎలా గుర్తించాలి?: మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు గురక వల్ల అకస్మాత్తుగా మేలుకుంటారు. లేదా మీ భాగస్వామి గురక ఆపాలంటూ అకస్మాత్తుగా నిద్రలేపుతుంది. దాని వల్ల గురక ఆగుతుంది లేదా తగ్గుతుంది. ఈ సమస్య మిమ్మల్ని పదే పదే వేదిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే.. స్లీప్ అప్నియాకు అధిక రక్తపోటు, అరిథ్మియా, స్ట్రోక్, గుండె వైఫల్యంతో సంబంధం ఉంటుంది.
గురక గుండెకు చేటు: గుండె ఆరోగ్యానికి సంబంధించి.. మనం చాలాసార్లు రక్తపోటు, మధుమేహం, ఒత్తిడి, చెడు ఆహారం, జీవనశైలి గురించి మాత్రమే చర్చిస్తాం. కానీ, తీవ్రమైన గురక సమస్య కూడా గుండె సమస్యలకు కారణమనే సంగతి చాలామందికి తెలియదు. గురక శ్వాస మార్గాన్ని అడ్డుకుంటుంది. అది క్రమేనా ‘స్లీప్ అప్నియా’కు కారణమవుతుంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. మయో క్లీనిక్ అధ్యయనం ప్రకారం.. స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన నిద్ర వ్యాధి. దీనివల్ల శ్వాస పదేపదే ఆగి ప్రారంభమవుతుంది. మీరు గురక పెట్టి రాత్రంతా హాయిగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోయినట్లు అనిపిస్తే మీకు ‘స్లీప్ అప్నియా’ ఉన్నట్లే. ఈ సమస్య ముదిరితే గురక పెట్టేవారు నిద్రలోనే కన్నుమూసే ప్రమాదం ఉంది.
స్లీప్ అప్నియాకు 3 రకాలు:
⦿ స్లీప్ అప్నియాకు అనేక కారణాలు ఉన్నాయి. గొంతు కండరాలు సంకోచ వ్యాకోచాల వల్ల కూడా ఇది ఏర్పడుతుంది. దీన్ని Obstructive sleep apnoea అని అంటారు.
⦿ శ్వాసను నియంత్రించే కండరాలకు మీ మెదడు సరైన సంకేతాలను పంపనప్పుడు ఏర్పడే సమస్యను Central sleep apnoea అని అంటారు.
⦿ మీ మెదడు శ్వాసను నియంత్రించే కండరాలకు సరైన సంకేతాలను పంపనప్పుడు ఏర్పడే సమస్యను Complex sleep apnoea syndrome అని అంటారు. ఈ మూడిట్లో ఏది జరిగినా ‘గురక’ ఏర్పడుతుంది.
ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి:
☀ 2013లో ‘లారింగోస్కోప్’ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గురక పెట్టేవారిలోని కరోటిడ్ ధమనులు మందంగా మారినట్లు కనుగొన్నారు. గురక వల్ల కలిగే ప్రకంపనల వల్ల ధమనులు గాయపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇది ‘స్లీప్ అప్నియా’కు దారి తీస్తుందని పేర్కొన్నారు.
☀ గురక.. స్మోకింగ్, అధిక బరువు కంటే ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గురక వల్ల స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌లు ఏర్పడవచ్చని చెబుతున్నాయి.
☀ స్లీప్ అప్నియాకు వెంటనే చికిత్స చేయకపోతే.. రక్తపోటు, స్ట్రోక్, అరిథ్మియా, డయాబెటిస్, ఊబకాయం సమస్యలు వస్తాయి.
☀ ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారి గొంతులో కొవ్వు సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఇది నిద్ర లేమి, స్థూలకాయానికి దారి తీస్తుంది.
☀ గురక మిమ్మల్ని వేదిస్తున్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Note: ఇది ABP Desam ఒరిజనల్ కంటెంట్. copyright కింద చర్యలు తీసుకోబడతాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి