Sleeping Position: బోర్లా పడుకోవడం అలవాటా? మీరు తప్పకుండా ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాలి
మనం పడుకునే విధానం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడాలంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
దిండుకి ముఖం ఆనించి బోర్లా పడుకుంటే ఆహా.. అలా ఎంతసేపైనా నిద్ర పోవాలని అనిపిస్తుంది కదా. మనలో చాలా మంది బోర్లాగా పడుకునే నిద్ర పోయే అలవాటు ఉంది. కానీ ఇలా పడుకోవడం వల్ల కొద్దిగా మేలు ఉంటే.. ఎక్కువగా నష్టమే కనిపిస్తుంది. పొట్ట మీద పడి నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. ఇలా నిద్రించడం వల్ల వెన్ను, మెడ, భుజం నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు పొట్ట మీద ఒత్తిడి పెట్టి బోర్లా అసలు పడుకోకూడదు. అది కడుపులోని బిడ్డకి అసలు మంచిది కాదు. ఇలా పడుకోవడం వల్ల హానికరమైన ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
బోర్లా పడుకుంటే ఏమవుతుంది?
పొట్ట మీద పడుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీపు, మెడలో ఒత్తిడి కలగడం వల్ల రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుంది. అయితే ఇలా పడుకోవడం వల్ల నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే బోర్లా పడుకున్నప్పుడు మొహం ఒక వైపుకి పెట్టి పడుకుంటాం. కొన్ని సార్లు అటు ఇటు తిప్పుతూ ఉండటం వల్ల మెడలు నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు ఒక్కోసారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుగా కూడా మారే అవకాశం ఉంది. ఇలా పడుకోవడం వల్ల వెన్నెముక మీద ఇబ్బంది పడుతుంది. మన శరీరం మొత్తం పరుపులోకి దిగబడిపోయినట్టుగా మునిగిపోతుంది. దాని వల్ల వెన్నెముక ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. నిద్ర లేచిన తర్వాత దాని తాలూకు నొప్పులు కనిపిస్తాయి. ఇవే కాదు మెడ, భుజం నొప్పుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. బోర్లా పడుకున్నపుడు శ్వాస తీసుకోవడానికి మెడ అటు ఇటు తిప్పడం వల్ల మెడ నొప్పి వచ్చేస్తుంది.
మొహం మీద ముడతలు కూడా పడొచ్చు
మనం ముఖాన్ని ఒకవైపు మాత్రమే దిందులోకి నొక్కడం వల్ల చర్మం సాగిపోతుంది. దీని వల్ల మొహం మడతలు పడి ఇబ్బంది పెడుతుంది. అయితే, పొట్ట మీద పడి బోర్లా నిద్రపోవడం వల్ల గురక, స్లీప్ అప్నియా ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
గర్భిణీలు అసలు పడుకోకూడదు
గర్భిణీలు పొట్ట మీద అసలు నిద్రించకూడదు. మొదటి త్రైమాసికంలో పొట్ట ఎక్కువగా రాదు కనుక ఎప్పుడైనా ఒకసారి పడుకున్న ఇబ్బంది లేదు కానీ నెలలు నిండే కొద్ది పొట్ట పెరుగుతుంది. ఆ సమయంలో బోర్లా పడుకుని నిద్రపోతే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. దాని వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వచ్చేస్తాయి. గర్భధారణ సమయంలో నిద్రలేమి కారణంగా నెలలు నిండకుండానే ప్రసవం జరగడం, ప్రసవానంతరం కూడా సమస్యలు వస్తాయి. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా ఎడమ వైపుకి తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తారు. అలా చేయడం వల్ల కడుపులోని బిడ్డకి శ్వాస అందుతుందని అంటారు. ఆ భంగిమలో నిద్రించడం వల్ల కాలేయంతో పాటు కాళ్ళ నుంచి గుండెకి రక్తాన్ని తీసుకెళ్ళే సిరపై ఒత్తిడి లేకుండా చేస్తుంది. పిండం, గర్భాశయం, మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
వెల్లికిలా పడుకోవాలి
ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లికిలా పడుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పి అదుపులో ఉంటుంది. చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది. అయితే వెల్లికిలా పడుకోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. గురక, స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే స్లీపింగ్ పొజిషన్ ఎడమవైపుకి మార్చుకోవాలి.
అలవాటు నుంచి బయటపడటం ఎలా?
బోర్లా కాకుండా వెల్లికిలా పడుకోవడానికి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మీ పక్కన పొడవుగా దిండ్లు లేదా బరువైన దుప్పట్లు పెట్టుకోవాలి. మీరు బోర్లా పడుకొని తిరగాలని అనిపించినప్పుడు అవి మిమ్మలని అడ్డుకుంటాయి. ఎంత ప్రయత్నించినా ఆ అలవాటు మానలేకపోతే తల దిండ్లు సన్నని ఉపయోగించుకోవాలి. దాని వల్ల మెడ మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. దిండు లేకుండా పడుకున్న కూడా మంచిదే.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: కోడి గుడ్డే కాదు, దాని పెంకు కూడా ఆరోగ్యానికి మేలే!