Parenting Tips: పిల్లలు భయం, బెరుకుగా ఉంటున్నారా? వారిలో ఆత్మవిశ్వాసం ఇలా పెంచండి
పిల్లల మనసు చాలా సున్నితమైనది. అందుకే వారితో వ్యవహరించే తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా మంది పిల్లలు ఆత్మన్యూనత భావంతో ఉంటారు. తమకు ఏది రాదని, ఏమి చేయలేమని అనుకుంటూ అందరి కంటే వెనుకబడి పోతారు. ఏదైనా చేయాలంటే త్వరగా ముందడుగు వేయడానికి సంకోచిస్తారు. అటువంటి సమయంలో అండగా నిలవాల్సింది తల్లిదండ్రులే. పిల్లల్ని ఆత్మవిశ్వాసంతో పెంచడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల పెంపకం విషయంలో తప్పనిసరిగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎదిగే కొద్ది ప్రతి విషయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి నమ్మకం కలిగించడానికి మీరు పిల్లలకి ఎంతో ధైర్యం చెప్పాలి.
తప్పనిసరిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి
పిల్లలు తమ జీవితంలో సానుకూలంగా ముందడుగు వేయాలంటే తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం మెరుగుపరచాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులదే. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు ఏ విషయాన్ని అయినా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ జీవితానుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు వారితో పంచుకోవాలి. తమ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కెరీర్ ఎంచుకుంటే తమ భవిష్యత్ బాగుంటుంది అనే నిర్ణయాలు సొంతంగా తీసుకోగలుగుతారు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా దాన్ని అధిగమించేలా వారిని ప్రోత్సహించాలి.
ఏదైనా సాధించినప్పుడు అ చిన్న విషయం అయినప్పటికీ చాలా గొప్పగా చేశావ్ అందరి కంటే నువ్వే బాగా చేశావ్ అనే మాటలు చెప్పాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఒక చిన్న ప్రశంస వారిని మరింత ఉత్తేజపరుస్తుంది. వారిలో విశ్వాసాన్ని పెంచేందుకు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తునే ఉండాలి. ఎంత బిజీ లైఫ్ అయినా కూడా పిల్లలతో రోజులో కనీసం రెండు గంటల సమయం అయినా గడపాలి. వారితో మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళ స్థాయికి దిగి వ్యవహరించాలి. పిల్లలకి అర్థం అయ్యేలా చెప్పేందుకు ఎన్ని సార్లు అయినా ప్రయత్నించాలి.
అప్పుడప్పుడు ప్రశంసించాలి..
పిల్లలు ఏదైనా సాధించినప్పుడు వారిని అభినందించాలి. వాళ్ళ బలం ఏంటో గ్రహించి బలహీనతలు ఎట్టి చూపకుండా వాటిని అధిగమించే విధంగా మార్గనిర్దేశం చెయ్యాలి. అలా అని అతిగా కూడా ప్రశంసించకూడదు. అలా చేస్తే విశ్వాసానికి బదులు అహంకార వైఖరి పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు తనని తాను పరిశీలించుకుని మార్చుకోవడం అవసరం. అలా వారికి తల్లిదండ్రులే నేర్పించాలి.
కథలు చెప్పాలి
జీవితానుభవాలతో పాటు పిల్లలు ధైర్యం వచ్చే విధంగా కథలు, కథనాలు చెప్పాలి. జానపద లేదా ఆత్మవిశ్వాసం పెంపొందే విధంగా సహాయపడే కథలను చెప్పాలి. మంచి, చెడు ఏమిటి అనేది కథల ద్వారానే వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చెడుకి వ్యతిరేకంగా నిలబడి పోరాడిన దేవుళ్ళు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి కథలుగా కూడా మీరు మీ పిల్లలకి చెప్పవచ్చు.
ఇవి మర్చిపోవద్దు
❂ ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కఠినమైన, అసభ్యకరమైన పదజాలంతో దూషించడం, విమర్శించడం చెయ్యకూడదు.
❂ పోటీ ఉన్నప్పుడు ప్రత్యర్థి గురించి కూడా సానుకూలంగా మాట్లాడాలి.
❂ ప్రశంస ముఖ్యమే కానీ అది పరిమితి దాటకూడదు.
❂ దయ, కరుణ, జాలి చూపించడం నేర్పించాలి.
❂ దానగుణం నేర్పించాలి, విరాళాలు ఇచ్చే విషయంలో వ్యవహరించే తీరు గురించి చెప్పాలి.
❂ బలాల గురించి మాట్లాడుతూనే బలహీనతలు అధిగమించేలా సూచనలు ఇవ్వాలి.
❂ డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపు గురించి చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ సమయాల్లో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు