జుట్టు రాలడం, మలబద్దకంపై అశ్రద్ధ వద్దు - అవి ఈ వ్యాధికి సంకేతం కావచ్చు
అయోడిన్ లోపం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతోంది. ఈ లోపం చాలా రకాల అనారోగ్యాలకు కారణమని నిపుణులు అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 మిలియన్ల మంది అయోడిన్ లోపంతో బాధపడుతున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. సమతుల ఆహారం దొరకని పేద దేశాల్లో ఇది ఎక్కువగా ఉండొచ్చు. అయోడిన్ భోజనంలో అందించడంలో విఫలమవుతున్న పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా గర్భిణులకు అయోడిన్ ఎక్కువగా అవసరం ఉంటుంది. సరిపడినంత అయోడిన్ అందకపోతే వీరిలో లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుందని అపోలో డయాగ్నస్టిక్స్ కార్పొరేట్ పాథాలజిస్ట్ డాక్టర్ అశోక వర్షిణి పంగా అంటున్నారు.
అయోడిన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు
- గొంతు దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ల వాపు వస్తుంది. అందువల్ల అది కణితి మాదిరిగా కనిపిస్తుంది.
- థైయిరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనిని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజంలో చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి.
- చలి తట్టుకోలేకపోవడం
- మలబద్దకం
- పొడి బారిన చర్మం
- కండరాల బలహీనత
- రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం
- కండరాలు, కీళ్లు బిగుసుకుపోవడం, కీళ్లు, కండారాలలో నొప్పి
- దిగులుగా ఉండడం, జుట్టు రాలడం, గుండె వేగం తగ్గడం
- స్త్రీలలో నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం
- జ్ఞాపక శక్తి తగ్గిపోవడం
⦿ ఇలా చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల అనారోగ్యాలు కూడా అయోడిన్ లోపం వల్ల కలుగ వచ్చు. హైపోథైరాయిడిజానికి సరైన చికిత్స తీసుకోకపోతే దాని వల్ల చాలా సమస్యలు రావచ్చు.
⦿ గుండె సమస్యలు దాని పర్యవసనంగా వచ్చే హార్ట్ ఫెయిల్యూర్, ఎన్లార్జ్‌డ్ హార్ట్ వంటి ఇతర సమస్యలు రావచ్చు
⦿ పెరీఫెరల్ న్యూరోపతి, లేదా పెరీఫరల్ నాడులకు నష్టం వాటిల్లడం, డిప్రెషన్, మెదడు పనితీరు మందగించడం వంటి నాడీ సంబంధ సమస్యలు రావచ్చు.
⦿ తక్కువ థరైరాయిడ్ హర్మోన్ లెవెల్స్ గర్భిణుల్లో ఏర్పడితే పుట్టబోయే పిల్లల్లో పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు.
⦿ గడువుకు ముందే ప్రసవం, స్టిల్ బర్త్, మిస్ క్యారేజ్ పుట్టబోయే పిల్లల్లో మెదడు పెరుగుదలలో లోపాలు, క్రెటినిజం వంటి తీవ్రమైన పరిణామాలకు కూడా గర్భవతుల్లో అయోడిన్ లోపం కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలా గుర్తించాలి?
⦿ డాక్టర్లు అయోడిన్ లోపం ఉన్నట్టు అనుమానిస్తే వెంటనే నాలుగు రకాల పరీక్షలు చేయిస్తారు.
⦿ మూత్ర పరీక్ష – చాలా సులభమైన తక్కువ సమయంలో చెయ్యగలిగే పరీక్ష. కొన్ని నిమిషాల్లోనే ఫలితం చెప్పవచ్చు. అయితే దీనితో పాటు మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి.
⦿ రక్త పరీక్ష- ఈ లక్షణాలను రక్త పరీక్ష ద్వారా కూడా గుర్తించవచ్చు. ఇది కచ్చితమైన పరీక్ష కానీ ఫలితం రావడానికి చాలా సమయం పడుతుంది.
⦿ అయోడిన్ పాచ్ టెస్ట్ – ఇందులో చర్మం మీద ఒక అయోడిన్ ప్యాచ్ ను అతికిస్తారు. 24 గంటల పాటు దీన్ని ఆబ్జర్వేషన్ లో ఉంచుతారు. అయోడిన్ లోపం ఉంటే ఈ ప్యాచ్ 24 గంటల్లో మాయం అవుతుంది. లోపం ఉన్నపుడు అయోడిన్ ను చర్మం త్వరగా పీల్చుకుంటుంది.
చికిత్స
ఆహారం ద్వారా తగినంత అయోడిన్ అందనపుడు అయోడిన్ లోపాన్ని సరిచెయ్యడానికి అయోడిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. తరచుగా వీగన్స్, వెజిటురియన్స్, గర్భిణులు ఆహారం ద్వారా తగినంత అయోడిన్ తీసుకోరు. పోటాషియం అయోడేట్ రూపంలో అయోడిన్ ఇస్తారు. రోజుకు 150 ఎంసీజీ కి మించి విటమిన్ సప్లిమెంట్స్ వాడకూడదు. చాలా వరకు అయోడిన్ లోపం ఆహారంలో మార్పులు, సప్లిమెంట్లతో సరిచెయ్యడం సాధ్యపడుతుందని నిపుణుల సూచన.