Kushboo Sundar: షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
Kushboo Sundar About Her Father: తాజా ఇంటర్వ్యూలో ఖుష్బూ సుందర్ గతంలో తాను ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకుంది. సొంత తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చింది.
సీనియర్ నటి ఖుష్బూ (Kushboo Sundar) తనను సొంత తండ్రే లైంగికంగా వేధించాడు అంటూ గతంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన తండ్రి గురించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. షూటింగ్ కు వచ్చి మరీ కొట్టేవాడంటూ చెప్పి షాక్ ఇచ్చింది. తన తండ్రి వల్ల తనతో పాటు ఫ్యామిలీ అంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తాజాగా వెల్లడించింది ఖుష్బూ.
చిన్నప్పుడే లైంగిక దాడి , చిత్రహింసలు
తాజాగా ఖుష్బూ మాట్లాడుతూ "చిన్నతనంలోనే నా తండ్రి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నాకోసం నా తల్లి, సోదరులను కూడా ఆయన వదిలి పెట్టకుండా చిత్రహింసలు పెట్టేవాడు, దారుణంగా ప్రవర్తించేవాడు. కర్ర, చెప్పు, బెల్టు... ఏం దొరికితే దాంతో వాళ్లను కొట్టేవాడు. కొన్నిసార్లు అమ్మ తలను గోడకేసి కొట్టి, దారుణంగా హింసించేవాడు. తెలిసీ తెలియని వయసులోనే ఇలాంటి దారుణమైన వేధింపులను చూసాను. కానీ నాపై జరుగుతున్న ఈ దాడిని బయట పెడితే, ఆయన వాళ్ళను మరింత నరకయాతనకు గురి చేస్తాడేమోనని భయపడి మొదట్లో ఎవరికీ చెప్పలేదు.
అతను ఏం చేసినా అలాగే భరించాను. కానీ చెన్నైకి వచ్చి, సినిమా ఇండస్ట్రీలో నా కాళ్లపై నేను నిలదొక్కుకున్న తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకున్నాను. ఆయనకు ఎదురు తిరగడం మొదలు పెట్టిన తర్వాత తట్టుకోలేక షూటింగ్ కు కూడా వచ్చి, అందరి ముందు నన్ను కొట్టేవాడు" అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.
ఆమె సాయం వల్లే ధైర్యంగా...
ఖుష్బూ ఇంకా మాట్లాడుతూ "అప్పట్లో ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ ఈ విషయంలో నాకు చాలా సాయం చేసింది. అతని ప్రవర్తన నాతో సరిగ్గా లేదని గమనించిన ఆమె, నా నుంచి విషయం తెలుసుకుని స్ట్రాంగ్ గా ఉండేలా ధైర్యాన్ని నూరి పోసింది. 14 ఏళ్ల వయసులో ఆ విధంగా ఫస్ట్ టైం లైంగిక వేధింపుల గురించి బయట మాట్లాడాను. దీంతో ఆ తర్వాత మా నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదు. నేను కూడా కనుక్కోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అతన్ని కలవలేదు కూడా. తెలిసిన వాళ్ళు ఎవరో అతను గత ఏడాది చనిపోయాడని చెప్పారు" అంటూ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఖుష్బూ వెల్లడించింది.
ఇదే మొదటిసారి కాదు
ఇదిలా ఉండగా, ఖుష్బూ తన తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు స్వయంగా వెల్లడించింది. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సీనియర్ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఇక ఖుష్బూ ప్రస్తుతం మహిళా కమిషన్ లో ఉన్న ఆమె ఎవరైనా మహిళలను కించపరిస్తే ఏమాత్రం సహించదు. అంతేకాకుండా ఖుష్బూ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.