Sajjala Ramakrishna Reddy: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్
Andhra Pradesh News: కడపలో అటవీ, చుక్కల భూములను సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ ఆక్రమించిందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. సమగ్ర విచారణ చేయాలని పవన్ ఆదేశించారు.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అన్నీ తానై వ్యవహరించిన సజ్జలరామకృష్ణారెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకునేలా కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయం కేసులో ఆయన పేరు ఉందని తర్వాత కాదంబరి జత్వాని ఇలా వేర్వేరు కేసుల్లో ఆయన పేరు ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. అన్నీ సైలెంట్ అయ్యాయని అనుకుంటున్న టైంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.
కడప జిల్లా సీకే దిన్నె మండల రెవెన్యూ పరిధిలో సజ్జల కుటుంబానికి సాగుభూమి ఉంది. అందులో దాదాపు 50 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై ప్రధాన మీడియాలో కథనాలు రాస్తున్నారు. ఇవన్నీ చూసిన ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. విచారణకు ఆదేశించింది. ఇందులో నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర లేకపోయినా ఆయన ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి సంచలనంగా మారుతోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అటవీ భూములతోపాటు చుక్కల భూములను కూడా తమ ఎస్టేట్‌లో కలిపేసుకున్నారని అంటున్నారు. సర్వే నెంబరు 1629లో 52.20 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూములు సజ్జల సోదరుడి కుమారుడి పేరుతో ఉన్నట్టు టీడీపీ చెబుతోంది.
1993లో ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని కూడా సజ్జల ఫ్యామిలీ ఆక్రమించుకుందని రాజానాయక్ ఈ మధ్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కథనాలు, రాజానాయక్ ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం స్పందించింది. వెంటనే అధికారులను అక్కడకు పంపించి అసలు విషయం తేల్చాలని పేర్కొంది. సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులను పవన్ కల్యాణ్ సూచించారు. ఎంత అటవీ భూమి ఆక్రమణకు గురైంది... ఎవరు ఆక్రమించారు. ఎక్కడైనా వన్యప్రాణులకు హాని జరిగిందా ఇలా అన్ని విషయాలపై స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇప్పటికే టీడీపీ ఆఫీస్‌పై దాడి సహా వివిధ అంశాల్లో సజ్జల పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఈ వివాదం కూడా ఆయన చుట్టూనే తిరుగుతోంది.
Also Read: విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ కు ఇంకా దక్కని ఆమోదం - మోదీ పర్యటన ఖరారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

