Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ ఆమోదంపై వీడని సస్పెన్స్ - ఉత్కంఠ రేపుతున్న మోదీ శంకుస్థాపన!
Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. మోదీ పర్యటనకు అంతా సిద్ధమైంది. డీపీఆర్ కు మాత్రం ఇంకా ఆమోదం లభించలేదు.
Vizag Railway Zone : ఉత్తరాంధ్రలోని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రతిసారి రైల్వే జోన్ అంటూ ఏదో ఒక అప్‌డేట్ వస్తుంది, కానీ కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) గతంలోనే సిద్ధం చేసినా ఇంకా ఆమోదం రాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అసలే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఫిక్స్ అని, ఆయన రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారన్న ప్రచారం స్థానికంగా ఊపందుకుంది. తీరా చూస్తే డీపీఆర్‌కు ఆమోదం రాకుండా, శంకుస్థాపన జరుగుతుందా.. ఇంతకీ ప్రధాని మోదీ వస్తారా లేదా కొత్త టెన్షన్ మొదలైంది.
డీపీఆర్ పై రాని స్పష్టత
జనవరి 8న ప్రధాని మోదీ ఏపీ పర్యటనరకు రానున్నారని, విశాఖ రైల్వే జోన్ పనులకు శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ రియాలిటీకి వస్తే ముందు డీపీఆర్‌పై ఎటూ తేలలేదు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఫిబ్రవరి 2019లోనే ప్రకటింటించి. అదే ఏడాది డీపీఆర్ ను కూడా రూపొందించారు. రైల్వే జోన్ స్వరూపాన్ని చూపించే డీపీఆర్ మాత్రం ఇంకా ఆమోదం పొందలేదు. గతంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. కేంద్రం సిద్ధంగా ఉందని, అప్పటి వైసీపీ ప్రభుత్వం భూములు కేటాయించి ఇవ్వలేదని పేర్కొనడం రాజకీయంగా సంచలనం రేపింది. గతంలో ఆరిలోవ ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన 53 ఎకరాల్లో దక్షిణ కోస్తా రైల్వేజోన్ భవనానికి ప్రతిపాదనలు పంపినా కేంద్రం అందుకు ఆమోదించలేదన్న వాదన ఉంది. విశాఖ జోన్ లో వాల్తేరు డివిజన్ ఉంటుందా, లేదా అని క్లారిటీ రావాల్సి ఉంది.
2022లో జోన్ ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణానికి డీఆర్ఎం ఆఫీస్ ఎదురుగా ఉన్న వైర్ లెస్ కాలనీ ఎంపికైంది. మొత్తం 13 ఎకరాల్లో 8 ఎకరాలలో హెడ్ క్వార్టర్ట్స్ డిజైన్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదించారు. అంతా ఓకే అనుకునే లోపు 2022 నవంబర్ 12న ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది.
రాయగడ డివిజన్ కు శంకుస్థాపన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ తో పాటు వాల్తేరు డివిజన్ లో కొంత భాగం, ఈస్ట్ కోస్ట్ లోని కొంత భాగంతో కొత్తగా రాయగడ డివిజన్ ను ప్రకటించారు. రైల్వే జోన్ కోసం రూ.106కోట్లు ప్రకటించగా.. రాయగడకు మాత్రం రూ.70కోట్లు మంజూరైంది. వాల్తేరు రైల్వే డివిజన్ ను విజయవాడ డివిజన్ లో కలిపి మొత్తం రూట్లు, లైన్లు ఖరారు చేశారు. రాయగడ డివిజన్ లైన్లు ఇప్పటికే ఖరారైనట్టు సమాచారం. జనవరి 6న ప్రధాని మోదీ వర్చువల్‌గా రాయగడ డివిజన్ కు శంకుస్థాపన చేయనున్నారని వినిపిస్తోంది.
మోదీ పర్యటనకు ఏర్పాట్లు
జనవరి 8న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. విశాఖ రైల్వే జోన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.