Cholesterol: కొలెస్ట్రాల్‌తో భారమవుతున్న నగర జీవితాలు - ఈ లక్షణాలు కనిపిస్తే, బీ అలర్ట్!
శరీరంలో అధికంగా కొవ్వు చేరితే అది గుండెకి చాలా ప్రమాదం. మన దేశ ఆర్థిక రాజధాని వాసుల ఆరోగ్యం మీద జరిపిన ఒక సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
భారత ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) రూపొందించిన స్టెప్స్ (స్టెప్ వైజ్ అప్రోచ్ టు సర్వైలెన్స్) పద్ధతిని ఉపయోగించి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఒక సర్వే నిర్వహించింది. 18-69 ఏళ్ల వయస్సులో ఉన్న దాదాపు 37 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ తో పాటు గుండె జబ్బుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం శారీరక శ్రమ పేలవంగా ఉండటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, పొగాకు వినియోగం, అధిక బరువు, రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న దాదాపు 74.3 శాతం మంది రోజువారీ దినచర్యలో ఫిట్ నెస్/ స్పోర్ట్స్ సంబంధిత శారీరక శ్రమ లేదని ఫలితంగా కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. ఇంకా వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 25kg/m2 కంటే ఎక్కువగానే ఉంది. అంతే కాదు ముంబయి నివాసితుల్లో 46 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని సర్వే కనుగొంది. సుమారు 12 శాతం మంది ఊబకాయం బారిన పడితే ఎక్కువ మంది పొగాకు వినియోగం వల్ల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. నగరవాసుల్లో దాదాపు 12 శాతం మంది రోజు పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు సగటున రోజుకి 8.6 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. ఒక వ్యక్తి సగటున 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అది ఆరోగ్యం కూడా లేదంటే ఉప్పు అధికంగా తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ముంబయి వాసుల ఆరోగ్యం మీద అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రక్తపోటు, డయాబెటిస్ స్క్రీనింగ్ ప్రారంభించినట్టు బీఎంసీ అదనపు కమిషన్ల డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. రోగనిర్ధారణ చేసి అందుకు తగిన విధంగా చికిత్స చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు, లక్షణాలు
కొలెస్ట్రాల్ స్థాయిలని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. లేదంటే ఇది పరిమితి దాటి గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ కి దారితీసే ప్రమాదం ఉంది. లిపిడ్ ప్యానెల్ అనే రక్త పరీక్ష ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కొలుస్తారు. మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
కాళ్ళ వేళ్ళ నొప్పి: కాళ్ళు, చేతుల్లో రక్త నాళాలను అడ్డుకునే కొలెస్ట్రాల్ చేరడం వల్ల బాధ నొప్పి, తిమ్మిరి, కాలి వేళ్ళలో జలదరింపుగా అనిపిస్తుంది. రక్త ప్రసరణలో అంతరాయం కారణంగా ఇది జరుగుతుంది.
Xanthomas: అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో ఈ పరిస్థితి ఎదురవుతుంది. చర్మం కింద కొవ్వు పెరిగిపోతుంది. Xanthomas కాళ్ళు, చేతులపై ముద్దలాంటి పరిమాణాలు ఏర్పడతాయి. నొప్పి ఉండవు కానీ దురదగా అనిపిస్తాయి.
గోర్లు, చర్మం రంగు మార్పు: అధిక కొలెస్ట్రాల్ గోర్లు, చర్మం, కాళ్ళలో శారీరక మార్పులకు దారితీస్తుంది. ఫలితంగా గోళ్ళు, చర్మం తెలుపు లేదా పసుపు రంగులోకి మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. గోళ్ళ పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఒక్కోసారి అధికంగా ఉంటుంది.
కొవ్వును అదుపులో ఉంచడం ఎలా?
జీవనశైలిలో మార్పులు చేసుకుని సకాలంలో చికిత్స తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ సమస్యని అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన బరువులో ఉండాలి. మద్యపానం, ధూమపానం అలవాట్లు పూర్తిగా నిషేధించాలి. కొలెస్ట్రాల్ నియంత్రణకు ఆహారమే కీలకం. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సంతృప్త కొవ్వులు, ఉప్పు, అధిక చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Aslo Read: రోజులో కాసేపు కునుకు తీయడం మంచిదేనట, దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?