Heart Attack With Sex: సెక్స్ చేస్తే గుండె ఆగుతుందా? అసలు కారణం ఇదే, అబ్బాయిలూ జాగ్రత్త!
సెక్స్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? మరి నాగపూర్ యువకుడు సెక్స్ చేస్తూ ఎందుకు చనిపోయాడు?
కాలంతోపాటు మారుతున్న ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, నిద్రలేని రాత్రిళ్లు.. నేటి తరాన్ని త్వరగానే ముసలోళ్లను చేసేస్తున్నాయి. దీంతో 60లో మొదలయ్యే వ్యాధులు 20లోనే స్టార్ట్ అవుతున్నాయి. దీంతో 40 ఏళ్లకే గుండె నొప్పి, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, శరీరానికి మంచి వ్యాయామాన్ని అందించే సెక్స్ వల్ల కూడా గుండె నొప్పులు వస్తాయా? సెక్స్ చేస్తే చనిపోతారా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ఇటీవల నాగ్‌పూర్‌కు చెందిన అజయ్ పార్టే అనే యువకుడు తన ప్రియురాలితో లాడ్జిలో సెక్స్ చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. హాస్పిటల్‌కు తరలించే లోపే చనిపోయాడు. అయితే, అతడు గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అతడి మరణానికి మందులు, మాదక ద్రవ్యాలు కారణం కాదని తెలిసింది. గతంలో కూడా అతడికి ఎలాంటి గుండె సమస్యలు లేవని వెల్లడైంది. మరి అతడికి గుండె నొప్పి ఎందుకు వచ్చింది? సెక్స్ చేస్తే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందా?
దీనిపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. గుండె పోటుతో బాధపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు 40 ఏళ్ల లోపువారే. దీర్ఘకాలికంగా గుండె నొప్పి సమస్యలు లేని వ్యక్తులు ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించడం కష్టమే. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పి.. రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఫలితంగా బాధితుడు క్షణాల్లో అస్వస్థతకు గురవ్వుతాడు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇస్తే బతికే అవకాశం ఉంటుంది. కానీ, చాలామందికి సీపీఆర్ గురించి అవగాహన లేదు. ఫలితంగా గుండె నొప్పి మరణాలు పెరుగుతున్నాయి.
హార్ట్ ఎటాక్ అంటే?: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండెలోని ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు లేదా కొవ్వు పేర్కొన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల గుండెకు రక్తం ఆగిపోతుంది. ఫలితంగా వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి ఎక్కువ సేపు ఉన్నా.. శరీర భాగాలు అసౌకర్యంగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గుండె వైపు భాగాలు లేదా ఎడమ చేయి లాగుతున్నా, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించినా అప్రమత్తం కావాలి. చెమటలు పట్టి, చల్లగా అనిపిస్తున్నా దాన్ని గుండె నొప్పికి సంకేతంగా భావించాలి. గుండె నొప్పికి ముందు కొందరిలో తలనొప్పి, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
సెక్స్ చేస్తే గుండె నొప్పి వస్తుందా?: సెక్స్ చేస్తూ గుండెపోటుకు గురికావడం చాలా అరుదు. కేవలం వయస్సు మళ్లినవారిలో మాత్రమే అలా జరుగుతుంది. దీనిపై రీజెన్సీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ అభినిత్ గుప్తా ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “సెక్స్ సహజమైన చర్య. ఇది కూడా వ్యాయామం లాంటిదే. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు, హెల్తీ హార్ట్ ఉన్నవారికి ఈ సమస్యలు దరిచేరవు. అయితే, సెక్స్ చేస్తున్నప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కానీ, అది పెద్ద సమస్యాత్మకం కాదు. పిజికల్ ఫిట్‌నెస్ తక్కువగా ఉండేవారికి ఈ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, మీరు రోజు వాకింగ్ లేదా జాగింగ్, కనీసం మెట్లు ఎక్కిదిగడం వంటివి చేసినా.. సెక్స్ సమయంలో గుండె సమస్యలు రావు’’ అని తెలిపారు.
వైద్యుడి సూచనతోనే వయాగ్రాలు వాడాలి: ‘‘ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా, గుండె దడ లయ తప్పినా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శరీరక శ్రమ చేయకపోవడం ఉత్తమం. ముఖ్యంగా వ్యాయామం, సెక్స్‌కు దూరంగా ఉండాలి. గుండె సమస్యలకు మందు వాడుతున్నా జాగ్రత్తగా ఉండాలి. అంగస్తంభన కోసం వయాగ్రా వంటి మందులు వాడేప్పుడు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆ మందులు కూడా గుండె వేగాన్ని పెంచేస్తాయి. అలాంటి మాత్రలు రక్తపోటుకు కారణమవుతాయి’’ అని తెలిపారు. అయితే, సెక్స్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువని, వారానికి ఒకసారి సెక్స్ చేసే ప్రతి పదివేల మందిలో ఇద్దరు లేదా ముగ్గురు గుండెపోటుకు గురవ్వుతున్నారని పేర్కొన్నారు.
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సెక్స్ ఆరోగ్యానికి మంచిదే: సెక్స్ చేసేప్పుడు గుండెకు ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో గుండె లయ, రక్తపోటు పెరుగుతాయని తెలిపారు. ‘‘ఇలా జరగడం ఆరోగ్యానికి మంచిదే. పైగా సెక్స్ ప్రమాదకరం కాదు. సెక్స్ గుండెకు మేలు చేస్తుంది. వారానికి కనీసం రెండుసార్లు సెక్స్ చేసే స్త్రీ, పురుషులు ఆరోగ్యంగా ఉంటారు. సెక్స్ గుండెను బలోపేతం చేస్తుంది. మీ రక్తపోటు, ఒత్తిడిని తగ్గించడనాకి ఉపయోగపడుతుంది. సెక్స్ నిద్రను మెరుగుపరుస్తుంది. ఆందోళనను దూరం చేస్తుంది. ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, చేయి, మెడ నొప్పిగా అనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి.
Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?
గమనిక: వైద్య నిపుణులు చెప్పిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినా మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.