Saffron: మానసిక ఆందోళనను తగ్గించే కుంకుమ పువ్వు, తరచూ తింటే ఇంకెన్నో లాభాలు
కుంకుమ పూరేకులు వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
హిమాలయాల్లో పండే అరుదైన, ఖరీదైన పంట కుంకుమ పూరేకులు. అక్కడి వాతావరణంలోనే కుంకుమపూలు ఎంతో విరివిగా పండుతాయి. అందుకే అక్కడ్నించే దేశంలోని నలుమూలలకి కుంకుమ పూలు ఎగుమతి అవుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బంగారు దారాల్లా కనిపించే కుంకుమపూలు ప్రపంచంలోనే ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. వీటిని పెంచడం, భద్రపరచడం చాలా కష్టమైన ప్రక్రియలు. అందుకే వీటి ధర కూడా అధికంగానే ఉంటుంది.
కుంకుమ పూల పంటను పూర్తిగా చేత్తోనే పనులు చేసి, కష్టపడి పెంచాలి. ఎలాంటి మిషనరీలు ఉపమోగించకూడదు. ఈ మొక్కలను సాఫ్రాన్ క్రోకస్ అని పిలుస్తారు. ఈ ఖరీదైన మసాలా దినుసుకు 'సన్‌షైన్ స్పైస్' అనే పేరు కూడా ఉంది. దీని రంగే దీనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. కుంకుమ పువ్వులో మొక్కల సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. శరీరంలోని కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి.
మానసిక ఆరోగ్యానికి కుంకుమపువ్వు ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ డిప్రెసింట్‌గా పనిచేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం కుంకుమపువ్వు మానసిక సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జలుబు, జ్వరం వంటివి త్వరగా తగ్గుతాయి. వీటిలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కుంకుమపువ్వులో రిబోఫ్లావిన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపపడతాయి
ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్. ఇది అధికంగా విడుదలైతే మానసిక సమస్యలు తప్పవు. ప్రీమెనస్ట్రువల్ సిండ్రోమ్ (PMS) వచ్చే అవకాశం ఉంది. వాటి లక్షణాలను తగ్గించే శక్తి కుంకుమ పూరేకుల్లో ఉంది. కుంకుమపువ్వులో క్రోసిన్, క్రోసెటిన్ అనే రెండు రసాయనాలు ఉంటాయి. అధ్యయనాల ప్రకారం ఇవి అభ్యాసం, జ్ఞాపకశక్తి పనితీరులో సహాయపడుతుంది. ఇది శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. వీటిని తినడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ సౌందర్యానికి కూడా కుంకుమ పువ్వు చాలా అవసరం. ఇది సహజసిద్ధంగా మన చర్మానికి మెరుపును అందిస్తుంది. చర్మంపై వచ్చే మొటిమలను కూడా తగ్గిస్తాయి. వారానికి రెండు నుంచి మూడు సార్లు పాలల్లో కుంకుమ పూరేకులు వేసుకుని తాగితే ఎంతో మంచిది.
Also read: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవిగో, ఎంత తిన్నా మంచిదే
Also read: విపరీతమైన వేడి గుండె వైఫల్యానికి దారితీస్తుంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.