రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పార్కిన్‌సన్స్ వ్యాధి? అందుకే ఆ వణుకుడు? అసలేంటీ వ్యాధి, ఎందుకొస్తుంది?
రష్యా అధ్యక్షుడు పుతిన్ పార్కిన్‌సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వల్ల పుతిన్ మరో నియంతలా కనిపించాడు ప్రపంచానికి. చైనా దాదాపు అన్ని దేశాలు అతడి చర్యలను వ్యతిరేకించాయి. అదే సమయంలో పుతిన్ ఆరోగ్యం బాగోలేదని, ఉదర క్యాన్సర్ బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. అది దాదాపు నిజమేనని బ్రిటన్ ఇంటెలిజెన్స్ కూడా నిర్ధారించింది. కాగా కొన్ని వీడియోల్లో ఆయన ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, చేతులు వణకడం, ఆ వణకడం ఆపడం కోసం ఆయన టేబుల్ లేదా, పక్కనున్న ఏదో ఒక వస్తువు సహాయం తీసుకోవడం ప్రపంచమంతా గమనించింది. బ్రిటిష్ దినపత్రిక దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం పుతిన్ పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. ఒక వీడియోలో ఆయన గదిలో ఉన్న కుర్చీని చేరుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్టు కనిపించింది.
పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి?
ప్రపంచ ప్రసిద్ధ మాయో క్లినిక్ చెప్పిన ప్రకారం, పార్కిన్సన్స్ వ్యాధి అనేది నాడీ వ్యవస్థ లేదా నరాలు నియంత్రించే శరీర భాగాలను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాల వ్యాధి. దీని లక్షణాలు త్వరగా బయటపడవు. నెమ్మదిగా మొదలవుతాయి. ఇది వస్తే నడవడం, కూర్చోవడం, చేతులతో ఏదైనా పట్టుకోవడం అన్నీ కష్టంగానే ఉంటుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
అందరిలో కనిపించే మొదటి లక్షణం చేతుల్లో వణుకు. చిన్నగా మొదలయ్యే వణుకు రోజులు గడుస్తున్న కొద్దీ ఎక్కువైపోతుంది. కదల్లేకపోవడం, చేతుల్లో పట్టుకోల్పోవడం వంటివి ప్రారంభ దశల్లో కనిపిస్తుంది. రోగి ముఖంలో కూడా మార్పులు వస్తాయి. వారు నడిచేటప్పుడు చేతులు ఊపడం కష్టమవుతుంది. మాట్లాడడం అస్పష్టంగా మారుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధి కాబట్టి కాలక్రమేణా లక్షణాలు తీవ్రంగా మారుతాయి.
ఎందుకు వస్తుంది?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ చెప్పిన ప్రకారం, పార్కిన్సన్స్ వ్యాధి ఎప్పుడొస్తుందంటే... మెదడులోని కదలికలను నియంత్రించే ప్రాంతమైన బేసల్ గాంగ్లియాలో నరాల కణాలు బలహీనంగా మారడం లేదా చనిపోవడం వల్ల వస్తుంది. ఈ నరాల కణాలు ముఖ్యంగా డోపమైన్ అని పిలిచే ముఖ్యమైన మెదడు రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, డోపమైన్ అనేది మీ మెదడులో తయారైన న్యూరోట్రాన్స్‌మిటర్. ఇది జ్ఞాపకశక్తి, కదలిక, ప్రేరణ, మానసిక స్థితి, శ్రద్ధతో సహా శరీరంలోని అనేక విధును నియంత్రిస్తుంది. న్యూరాన్లు చనిపోయినప్పుడు లేదా బలహీనంగా మారినప్పుడు డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అయితే ఇలా న్యూరాన్లు ఎందుకు చనిపోతాయో మాత్రం వైద్య శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు.
చికిత్స ఉందా?
ఇంకా దీనికి సరైన చికిత్స విధానం అందుబాటులో లేదు. మందులు, కొన్ని సార్లు శస్త్ర చికిత్స కొంతమేర లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రోగికి బాధ, నొప్పి, నీరసం నుంచి కాపాడతాయి. దీనికి ప్రధానంగా చేసే చికిత్స ‘లెవోడోపా’. డోపమైన్‌ను తిరిగి నింపడానికి నాడీ కణాలు లెవోడోపాను ఉపయోగిస్తాయి.కార్బిడోపా అనే మరొక ఔషధాన్ని కూడా వైద్యులు సూచిస్తారు.
Also read: నల్ల నువ్వులతో ఇలా చేసుకుని తింటే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది
Also read: రవ్వ పాయసం, రవ్వ గారెలు - బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.