నల్ల నువ్వులతో ఇలా చేసుకుని తింటే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది
నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వాటిని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు... ఈ రెండూ భారతీయ వంటకాలలో ఎప్పట్నించో భాగమైపోయాయి. పోషకాలు నిండుగా ఉండే నువ్వులను తినమని వైద్యులు కూడా ప్రత్యేకంగా సిఫారసు చేస్తారు. వీటిని రోజూ మితంగా తింటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ముఖ్యంగా, అధిక రక్తపోటు ఉన్న వారికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇవి స్ట్రోక్స్ ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్లనువ్వులు తింటే చాలా మంచిదని సూచిస్తున్నారు.
నల్లనువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, జింక్, ఇనుము వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ఈ నువ్వుల్లో అవసరమైన మైక్రోమినరల్స్ ఉంటాయి. ఇవి కణాల పనితీరును నియంత్రించడంలో ముందుంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. జీవక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. మీ శరీరం అంతటా ఆక్సిజన్ చక్కగా ప్రసారం అయ్యేలా సహాయపడతాయి. నల్ల నువ్వుల్లో అధికంగా ఉండేది నూనె. ఇది మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు. పోషకాహార నిపుణుల అభిప్రాయ ప్రకారం అధిక సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని, అసంతృప్త కొవ్వులతో భర్తీ చేయడం వల్ల మీ గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోకులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అధికరక్తపోటుకు చెక్
నల్ల నువ్వుల్లో మెగ్నీషియం,ఫాస్పరస్ అధికంగా ఉంటాయని ముందే చెప్పాం కదా. ఇవి రెండూ అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి. ఈ చిన్న గింజలు హైపర్ టెన్షన్ అవకాశాలను తగ్గిస్తాయి. తద్వారా గుండె పోటు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. నువ్వుల్లో సెసమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కూడా అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది.
నల్ల నువ్వుల లడ్డూ
నల్లనువ్వులను పొడిలా చేసుకుని, లేదా చట్నీల్లో భాగం చేసుకుని తినవచ్చు. ఇలా కష్టం అనుకుంటే చక్కటి లడ్డూలా మార్చుకుని తినవచ్చు.
ఒక కప్పు నల్లనువ్వులు, అర కప్పు వేరుశెనగలు, అరకప్పు ఎండు కొబ్బరి కలిపి వేయించాలి. ఇప్పుడు మిక్సీలో వాటన్నింటినీ వేసి, ఒక టేబుల్ స్పూను నెయ్యి, ఒక స్పూను సోపు గింజలు, ఒక స్పూను నానబెట్టిన ఖర్జూరాలు కూడా వేసి రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని బయటికి తీసి చిన్న లడ్డూలా చుట్టుకోవాలి.
Also read: రవ్వ పాయసం, రవ్వ గారెలు - బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు
Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.