Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Silent Heart Attacks: శీతాకాలం అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. అందుకే ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
Heart Attacks in Winter : చలికాలంలో రోగాలు సర్వసాధారణం. అయితే, మనకు తెలియకుండానే మరో ప్రమాదకర సమస్య శరీరంలో నెలకొంటుంది. అదే హార్ట్ ఎటాక్. ఔనండి. చలికాలంలో గుండె నొప్పి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే ఈ సీజన్‌లో మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని సైలెంట్ హార్ట్ ఎటాక్ అని కూడా అంటారు.
హార్ట్ ఎటాక్ ఒక ప్రాణాంతక సమస్య. సకాలంలో ట్రీట్మెంట్ పొందకపోతే.. ప్రాణాలు పోతాయ్. అందుకే బాధితులకు సకాలంలో చికిత్స చేయించండం చాలా ముఖ్యం. కానీ కొన్ని సార్లు గుండె పోటు లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. చాలామంది ప్రాణాలు కోల్పోడానికి కారణం అదే. అసలు సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
చలికాలంలో వచ్చే గుండెపోటు లక్షణాలను అంతగా గుర్తించలేం. అందుకే దీన్ని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. సాధారణంగా గుండె పోటు వచ్చినప్పుడు శ్వాస సమస్యలు వస్తాయి. కానీ, చలికాలంలో వచ్చే ఈ అరుదైన గుండె పోటు వచ్చేప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి, మన కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది పేర్కొన్న సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి.
అధిక కొలెస్ట్రాల్:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ ధమనుల లోపల ఫలకం ఏర్పడుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గించడంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక రక్తపోటు:
దీన్ని హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు అధిక రక్తపోటు కూడా కారణం అవుతుందని ఆరోగ్యనిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు మీ గుండె, ధమనులు, ఇతర ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.
అధిక బరువు:
ఊబకాయం, అధిక బరువు అనేవి మీ గుండెపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. దీంతో సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ కు కారణం అవుతుంది. ఇవి గుండె సంబంధిత సమస్యలను పెంచుతాయి.
ధూమపానం:
స్మోకింగ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే సంగతి తెలిసిందే. అయితే చలికాలంలో చాలామంది అతిగా స్మోకింగ్ చేస్తారు. అది కూడా గుండెకు ప్రమాదకరమే. పొగాకులో ఉండే హానికర రసాయనాలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దానివల్ల గుండె నొప్పి ఏర్పడే ప్రమాదం ఉంది.
వయస్సు:
వయస్సు పెరిగే కొద్దీ గుండె సంబంధిత సమస్యలకు అవకాశం పెరుగుతుంది. వయస్సు కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే మీ ఫ్యామిలీలో హృద్రోగులు ఉన్నట్లయితే.. తర్వాతి తరాలు కూడా ముప్పులో ఉన్నట్లే. వారు కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.