Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్
పచ్చి బఠానీలతో చేసే స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇవి ఎంతో నచ్చుతాయి.
సీజనల్‌గా దొరికేవి పచ్చి బఠానీలు. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఎప్పుడు కూరల్లోనో, బిర్యానీల్లోనే కలుపుకుని తినడమేనా? వీటితో ఓసారి కట్‌లెట్ చేసుకుని తినండి. చల్లని సాయంత్రానికి ఇవి పర్‌ఫెక్ట్ స్నాక్. పిల్లలకు కూడా ఇది చాలా నచ్చుతుంది. కెచప్‌లో లేదా పుదీనా చట్నీలో డిప్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు.
కావాల్సిన పదార్థాలు
పచ్చి బఠానీలు - ఒక కప్పు
బంగాళాదుంప - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
చీజ్ క్యూబ్స్ - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
వెల్లుల్లి - అయిదు రెబ్బలు
బ్రెడ్ పొడి - నాలుగు స్పూన్లు
ఆలివ్ నూనె - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - పావు స్పూను
మ్యాంగో పొడి - అర స్పూను
యాలకుల పొడి - పావు స్పూను
తయారీ ఇలా
1. ఒక కళాయిలో ఒక స్పూను నూనె వేయాలి. అది వేడెక్కాక వెల్లుల్లి రెబ్బల తురుము, పచ్చిమిర్చి తురుము వేసి వేయించాలి.
2. అందులో బఠానీలు వేసి బాగా కలపాలి. అందులో ఉప్పు, యాలకుల పొడి వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
3. ఉడికాక స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
4. ఒక గిన్నెలోకి బఠానీల మిశ్రమాన్ని తీసి పెట్టుకోవాలి. అందులో ఉడికించిన బంగాళాదుంపలను చేత్తో మెత్తగా మెదిపి బఠానీలతో కలపాలి.
5. అందులో జీలకర్ర పొడి, బ్రెడ్ పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముద్దలా చేసుకోవాలి.
6. ఆ ముద్దలోంచి చిన్న ముద్ద తీసి మధ్యలో చీజ్ ముక్క పెట్టి మళ్లీ గుండ్రంగా చుట్టేయాలి.
7. ఆ గుండ్రని ఉండని చేత్తో కట్‌లెట్‌లా ఒత్తుకోవాలి. అలా అన్నీ ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ లో ఒక స్పూను నూనె వేయాలి. కట్‌లెట్‌లను నూనెపై ఉండి రెండు వైపులా వేయించాలి. బ్రౌన్ రంగులోకి మారే వరకు ఫ్రై చేయాలి.
పచ్చి బఠానీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి సీజనల్‌గా దొరుకుతాయి. కాబట్టి ఆ సీజన్లో కచ్చితంగా వాటిని తినాలి. వీటిని తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలేవీ కనిపించకుండా చూస్తుంది. వీటిని తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుతుంది. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇవి మంచి ఆహారం అని చెప్పాలి. వీటిలో ఫైటో అలెక్సిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. వీటిలో లుటీన్ అనే కెరోటినాయిడ్ కూడా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కంటిలో శుక్లాలు ఏర్పడకుండా కాపాడుతుంది. గుండె జబ్బుల బారిన పడకుండా పచ్చిబఠానీల్లోని పోషకాలు కాపాడతాయి. మధుమేహంతో బాధపడేవారు కూడా పచ్చి బఠానీలు తినడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ అధిక బరువును సులువుగా తగ్గిస్తుంది. వీటిని తిన్నాక ఆకలి తక్కవ వేస్తుంది. కాబట్టి అధికంగా ఆహారం తినకుండా కంట్రోల్ లో ఉంటాము.
Also read: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?