Eclampsia: గర్భిణీలకు వచ్చే ప్రాణాంతకమైన ఎక్లాంప్సియా గురించి తెలుసా? లక్షణాలు ఎలా ఉంటాయంటే
గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం అయ్యే వరకు తప్పనిసరిగా చెకప్ చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి.
2016 ఒలింపిక్ గేమ్స్ లో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలని సాధించిన యూఎస్ మాజీ ఒలిపిక్ స్ప్రింటర్ టోరీ బౌవీ గత నెల గర్భాదారణ సమస్యల కారణంగా మరణించారు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన ఆమె మే 2న తన ఇంట్లో శవమై కనిపించింది. ప్రసవ సమయంలో బౌవీ మరణించిందని ట్రాక్ అండ్ ఫీల్డ్ ధృవీకరించింది. కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం ఆమె శ్వాసకోశ ఇబ్బంది, ఎక్లాంప్సియాతో బాధపడుతున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పుడు ఆమె మరణం ప్రసూతి మరణాల సమస్యని మళ్ళీ హైలెట్ చేసింది. అసలు ఈ ఎక్లాంప్సియా అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికీ ఉంది.
ఎక్లాంప్సియా అంటే ఏంటి?
ఎక్లాంప్సియా అనేది అరుదైన తీవ్రమైన పరిస్థితి. గర్భధారణ సమయంలో లేదా ప్రసవానంతర కాలంలో సంభవిస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూర్చలు వస్తాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది ప్రీక్లాంప్సియా నుండి అభివృద్ధి చెందుతుంది. మహిళలు అధిక రక్తపోటుకి గురైనప్పుడు, గర్భం దాల్చిన 20 వారాల తర్వాత ప్రోటీన్ లోపం వంటి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రీక్లాంప్సియా సంభవిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గర్భం ధరించిన 5 నుంచి 7 శాతం వారిని ప్రీక్లాంప్సియా సమస్య ప్రభావితం చేస్తుంది. దీనికి చికిత్స చేయకపోతే అది మెదడు దిబ్బతినడం, కోమా, తల్లి, పిండం మరణానికి దారి తీస్తుంది.
ఎక్లాంప్సియా సంకేతాలు, లక్షణాలు
వైద్యులు చెప్పే దాని ప్రకారం గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకి కారణమయ్యే ప్రీఎక్లాంప్సియాకి సకాలంలో చికిత్స చేయకపోతే అది ఎక్లాంప్సియాకు దారితీయవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు..
⦿ అధిక రక్తపోటు
⦿ మూర్చలు
⦿ ముఖం, చేతులపై వాపు పెరగడం
⦿ దీర్ఘకాలిక తలనొప్పి
⦿ బరువు పెరగడం
⦿ వికారం, వాంతులు
⦿ దృష్టిలో మార్పు
⦿ తీవ్రమైన కడుపు నొప్పి
ఎక్లాంప్సియా చికిత్స
ప్రీఎక్లాంప్సియాతో బాధపడుతున్న స్త్రీలు ముందుగా భయపడకుండా తాము ఆరోగ్యవంతంగా బిడ్డని కనగలుగుతామని అర్థం చేసుకోవాలి. దానికి అవసరమైన మనోధైర్యం వాళ్ళకి కలిగించాలి. ఈ వ్యాధి పరిస్థితి ముందుగానే గుర్తించి క్రమం తప్పకుండా ప్రినేటర్ తనిఖీలు చేయించుకోవడం ముఖ్యం. కొన్ని ప్రాథమిక చర్యలు, సాధారణ పరీక్షలు వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డెలివరీ వరకు రెగ్యులర్ గా మానిటరింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. రక్తపోటుని నియంత్రించేందుకు, ప్రీఎక్లాంప్సియా ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యులు తరచుగా తక్కువ మోతాదు అస్పిరిన్ ను సూచిస్తారు. మెగ్నీషియం, సల్ఫేట్, స్టెరాయిడ్ ఇంజెక్షన్ వంటి యాంటీ కన్వల్సివ్ మందులు ఇస్తారు. రెగ్యులర్ గా రక్తం, మూత్ర పరీక్షలు, పిండం స్కాన్లు కూడా అవసరం. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయట పడొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నోరూరించే ఈ కుకీస్ తిన్నారంటే శరీరంలోని మొండి కొవ్వు కరగాల్సిందే