Pnig Pong: మీకు ఈ ఆరోగ్య సమస్యలున్నాయా? ‘పింగ్ పాంగ్’ ఆడండి - ఎందుకంటే?
పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ సమస్యలకు గార్డెనింగ్, పేయింటింగ్, వంట, ఏదైనా ఆట వంటి ఆక్టీవిటీలతో మంచి ఫలితం కనిపిస్తోందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.
నిత్యం వ్యాయామం చేసేవారు ఎన్నో వ్యాధుల నుంచి బయటపడొచ్చట. ఇక ఆటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని ఆటలు శరీరాన్ని దృఢంగా మార్చుతాయి. అయితే, ఇటీవలి కాలంలో చాలామందిని వేధిస్తోన్న ఓ వ్యాధికి ‘పింగ్ పాంగ్’ ఆట వరంలా మారిందట. ఈ టేబుల్ టెన్నీస్ తరహాలో ఉండే ఈ ఆట వల్ల మల్టిపుల్ స్క్లేరోసిస్, పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు తగ్గినట్టు గమనించారట.
పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం?
పార్కిన్సన్స్ అనేది బ్రెయిన్ డిజార్డర్. ఈ సమస్యలో అసంకల్పితంగా శరీరంలో వణుకు రావడం, కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని నివారించడం దాదాపు సాధ్యం కాదనే చెప్పాలి. చికిత్సలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. రోజురోజుకు లక్షణాలు తీవ్రంగా మారి రోజువారి పనుల నిర్వహణ కూడా కష్టంగా మారుతుంది. లక్షణాలు చిన్నగా మొదలవడానికి ముందుగానే గుర్తించగలిగితే తగిన ఆహారం, వ్యాయామం, ఫిజియోథెరపీ, కొన్ని మందులతో వ్యాధి త్వరగా ముదరకుండా ఆపే అవకాశం ఉంటుంది.
అరుదే కానీ..
మల్టీపుల్ స్క్లీరోసిస్ అనేది కొంచెం అరుదుగా కనిపించే అనారోగ్యమే. కానీ ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ సమస్యలో శరరీంలోని సొంత నిరోధక వ్యవస్థ వెన్నెముక, మెదడు కణజాలాల మీద దాడి చేస్తుంది. సమస్య తీవ్రతను బట్టి లక్షణాలు ఉంటాయి. అలసట, మూత్ర సంబంధ సమస్యలు, లైంగిక సమస్యలు, డిప్రెషన్, కండరాల పనితీరులో మార్పులు, మానసిక స్థితిలో మార్పుల వంటి లక్షణాలు ఉంటాయి. పరిస్థితిని అదుపు చెయ్యవచ్చు తప్ప దీనికి పూర్తిస్థాయి చికిత్సలు అందుబాటులో లేవు. చాలా సందర్భాల్లో స్టెరాయిడ్స్ వాడి పరిస్థితిని అదుపు చేస్తుంటారు.
మందులేని వ్యాధి కి ఇదో పరిష్కారం
మల్టిపుల్ స్క్లీరోసిస్, పార్కిన్సన్స్ రెండూ కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేని వ్యాధులే. ఈ వ్యాధుల వల్ల నాడీ కణాలు విచ్ఛిన్నం అవుతాయి. ఫలితంగా కండరాల మీద క్రమంగా నియంత్రణ కోల్పోతుంటారు. కండరాలు బలహీనపడి, గట్టి పడిపోతాయి. అయితే టేబుల్ టెన్నిస్ తో చెయ్యి, కంటి సమన్వయం, కండరాల బలాన్ని మెరుగు పరుస్తుంది. రెండు రకాల నాడీ క్షీణత మీద ప్రభావాన్ని చూపుతుంది.
2016 నుంచి మల్టీపుల్ స్క్లీరోసిస్ తో బాధపడుతున్న డాక్టర్ ఆంటోనియోబార్బెరా కొన్నేళ్లుగా పింగ్ పాంగ్ ఆడుతున్నారట. వారిలో మార్పులు గమనించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. పింగ్ పాంగ్ వేగం ఎక్కువ కనుక నిజంగా మన మెదడు పనితీరును సవాలు చేస్తుంది. కళ్లు, చేతులు, కాళ్లు ఒకే సారి పనిచెయ్యాల్సి ఉంటుంది. అర సెకన్ లోపే బాల్ వచ్చే విధానానికి ప్రాసెస్ చేసి ప్రతిస్పందించాల్సి ఉంటుంది.
2020లో జరిపిన ఒక ప్రత్యేక అధ్యయనంలో పార్కిన్సన్స్ బాధితులు ఐదునెలల పాటు పింగ్ పాంగ్ సాధన తర్వాత రాయడం, మాట్లాడడం, నడకలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఈ ఫలితాలు గమనించిన తర్వాత సోషల్ ప్రిస్కిప్షన్ చెయ్యాలని వైద్యులు ఆలోచిస్తున్నారు. గార్డెనింగ్, పేయింటింగ్, వంట, ఇతర ఆటలు వంటి కార్యకలాపాలు ఈ నాడీసంబంధ సమస్యలున్న వారికి నిపుణులు సూచిస్తున్నారు.