Epilepsy: మూర్ఛ ఉన్న వారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి
Epilepsy: చాలామందిని వేధిస్తున్న సమస్య మూర్ఛ.
Epilepsy: పెద్దలు, పిల్లలు తేడా లేకుండా మూర్ఛ వ్యాధి వేధిస్తోంది. దీన్నే ఫిట్స్, ఎపిలెప్సీ అని అంటారు. మూర్ఛ ఉన్న వారు హఠాత్తుగా స్పృహ కోల్పోతారు. ఇది మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే చాలు ఇక పోవడం ఉండదు. దీర్ఘకాలిక రుగ్మతగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. వీరు కిందపడి వణకడం, నాలుక కరుచుకోవడం వంటివి చేస్తుంటారు.
ఎప్పుడు వస్తుంది?
మూర్ఛ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏవైనా ఆరోగ్యసమస్యలు వచ్చినప్పుడు మూర్ఛ రావడం పెరిగిపోతుంది. జ్వరం అధికంగా ఉన్నప్పుడు, శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు, తలకు దెబ్బలు తాకినప్పుడు మూర్ఛ వస్తుంది. అలాగే మూర్ఛలు రెండు రకాలు. ఇందులో ఒకటి మెలకువగా ఉన్నప్పుడే వస్తుంది, రెండవది మాత్రం నిద్రలో వస్తుంది. కొంతమందిలో మూర్ఛ తరచూ వస్తుంటే, కొందరిలో మాత్రం ఏడాదికోసారి లేదా ఆరు నెలలకోసారి వస్తుంది. అంతేకాదు ఈ వ్యాధితో బాధపడే వారు త్వరగా డిప్రెషన్ బారిన పడతారు.
ఎందుకు వస్తుంది?
మూర్ఛ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎవరికి ఎందుకు వచ్చిందో చెప్పడం కష్టమే. మెదడుకు గాయం కావడం, అధికజ్వరం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, గుండె జబ్బులు, మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, మెదడులో కణితి ఏర్పడడం, అల్జీమర్స్ వ్యాధి ఉండడం, పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం, ఎయిడ్స్ , మెనింజైటిస్ వ్యాధి ఉండడం వంటి పరిస్థితుల్లో మూర్ఛ వ్యాధి వస్తుంది.
ఏం తినకూడదు?
మూర్ఛ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. తెల్లటి బ్రెడ్ (మైదాతో చేసినది), బిస్కెట్లు, కేకులు, తేనే, చక్కెర అధికంగా ఉండే పానీయలు, ఆహారాలు, చిప్స్, బంగాళాదుంపలు, పండ్ల రసాలు, పుచ్చకాయ, అతిగా పండిన పండ్లు, ప్రాసెస్డ్ ఆహారం... వీటన్నింటికీ దూరంగా ఉంటే మూర్ఛవ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూర్ఛ వ్యాధి పూర్తిగా నయం కాదు. కానీ తరచూ మూర్ఛ వచ్చే అవకాశం తగ్గుతుంది.
Also read: సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదా? చూస్తే ఏమవుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.