Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా వీటిని ఏదో ఒక పూట తినాల్సిందే
డయాబెటిస్ ఉన్నవారు ఆహారపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఒకప్పుడు వయసు పెరిగితేనే వచ్చేది డయాబెటిస్. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, 30 ఏళ్లు నిండిన వారికి కూడా డయాబెటిస్ వ్యాధి దాడి చేస్తుంది. ఈ వ్యాధి ఒకసారి వస్తే శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జీవితాంతం మందులు వాడాల్సిందే. అలాగే ఆహార విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే శరీరంలోని ప్రధాన అవయవాలకు ముప్పు తప్పదు. దీనివల్ల చివరకు మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి డయాబెటిస్‌ను ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. అలాగే ఆహార నియమాలు పాటిస్తూనే శరీరానికి కావలసిన పోషకలేవీ తగ్గకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మీదే. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు రోజుల్లో కచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లో తప్పకుండా తినడానికి ప్రయత్నించండి.
కందిపప్పు, పెసరపప్పు, కాబూలీ చనా, రాజ్మా వంటివి పప్పు జాతికి చెందిన దినుసులు. వీటితో వండిన ఆహారాలను రోజూ కచ్చితంగా తినాలి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఫైబర్ ఉండే బెండకాయ వంటి వాటిని రోజూ తింటే ఎంతో మేలు. బ్రౌన్ రైస్, క్వినోవా వంటివి కూడా రోజూ తినాలి. జామకాయలను రోజూ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆపిల్, దానిమ్మ, పియర్, ఆరెంజ్ పండ్లను రోజూ తినేందుకు ప్రయత్నించాలి. చేపలు, గుడ్లు తినడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. బ్రకోలి, క్యాప్సికం, ఆకుకూరలు ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా డయాబెటిస్ ను అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. రాగులు, కొర్రలు, సజ్జలు, ఓట్స్ వంటి వాటితో వండుకున్న ఆహారాలను తినడం వల్ల డయాబెటిస్ లక్షణాలు చాలా వరకు తగ్గిపోతాయి.
ఇక ఖచ్చితంగా తినకూడనివి కొన్ని ఉన్నాయి. స్వీట్లు వంటి తీపి పదార్థాలను పూర్తిగా నివారించాలి. అలాగే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. ఎండు చేపలు, అప్పడాలు, ఊరగాయలు వంటి వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. వాటిని తినకూడదు. అలాగే మైదాతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. నూడిల్స్ వంటివి అధికంగా మైదాతోనే చేస్తారు కాబట్టి నూడుల్స్‌ని కూడా తినకూడదు. పెప్సీలు, కోకో కోలాలు వంటి షుగర్ నిండిన డ్రింకులు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరిగిపోతాయి. నూనెలో డీప్ ఫ్రై చేసిన బజ్జీలు, బోండాలు వంటివి కూడా చాలా వరకు నివారించాలి. ఖర్జూరం కూడా రోజుకి రెండు కన్నా ఎక్కువ తినకూడదు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
Also read: ఈ టీ కప్పు ఖరీదుతో జీవితాంతం ఏ లోటు లేకుండా బతికేయొచ్చు
Also read: ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.