Paneer Making: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది
పనీర్ చాలా మందికి ఇష్టమైన వంటకం. దీనితో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు.
పాలతో తయారయ్యే ఓ పదార్థం పనీర్. పనీర్ తో రకరకాల స్వీట్లు, కూరలు, బిర్యానీలు చేసుకోవచ్చు. పనీర్ టేస్ట్‌గా ఉంటేనే వాటన్నింటికీ ప్ర్యతేక రుచి వచ్చేది. పనీర్ బయట కొని వండుకునే వాళ్లే ఎక్కువ.పనీర్ ను ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. చాలా మంది ఇంట్లోనే పనీర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది చక్కగా రాకపోవడం, ముక్కలుగా విడిపోవడం, పిండి పిండిగా మారడం వంటివి జరుగుతాయి. దీని వల్లే చాలా మంది బయట పనీర్ కొనడానికే ఇష్టపడుతున్నారు. ఇక్కడ చెప్పినట్టు చేస్తే పనీర్ పిండి పిండిగా విడిపోకుండా ముక్కల్లా వస్తుంది.
తయారీ ఇలా
లీటర్ పాలను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పావు గంట సేపు మరిగాక అందులో రెండు స్లూన్ల నిమ్మరసం వేసి పాలను విరగొట్టాలి. పాలు విరిగాక ఒక మూడు నిమిషాల పాటూ మరిగించాలి. తరువాత స్టవ్ కట్టేయాలి. వేడి తగ్గి గోరువెచ్చగా అయ్యాక ఒక వస్త్రంలో పాలను వడకట్టాలి. నీరు అంతా పోయి, వస్త్రంలో పాలు విరిగిన మిశ్రమం మిగిలిపోతుంది. వస్త్రాన్ని గట్టిగా చుట్టి పిండితే మిగతా నీరు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పాల మిశ్రమాన్ని వస్త్రంతోనే మూటలా కట్టి ఆ మూటను ఒక పీటపై పెట్టి బాగా బరువుగా ఉండే వస్తువును ఆ మూటపై పెట్టాలి. దాదాపు రెండు మూడు గంటల పాటూ అలా ఉంచేయాలి. ఇలా చేస్తే పాల మిశ్రమంలో ఉన్న కొద్ది పాటి నీరు కూడా పోయి పనీర్ చక్కగా తయారవుతుంది. మూడు గంటల తరువాత దాన్ని తీసి ఫ్రిజ్ లో పెట్టాలి. దీన్ని డీప్ ఫ్రిజ్ లో పెడితే రెండు వారాల వరకు తాజాగా ఉంటుంది.
తింటే ఎన్ని లాభాలో...
పన్నీర్ కర్రీ అంటే చాలా మందికి నోరూరిపోతుంది. పన్నీర్ బిర్యానీ రుచి కూడా అదిరిపోతుంది. పన్నీర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పాల వల్ల కలిగే లాభాలన్నీ పన్నీర్ వల్ల కలుగుతాయి. పన్నీర్ వల్ల కాల్షియం లోపం రాదు. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు గట్టిగా మారుతాయి. గర్భిణులు పనీర్ వంటకాలు తింటే గర్భస్థ శిశువు పెరుగుదల బావుంటుంది. మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలను అడ్డుకునే శక్తి దీనిలో ఉంది. షుగర్ ఉన్న వారు దీన్ని తినడం రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వెన్నునొప్పి, కీళ్ల నొప్పి ఉన్నవారు పనీర్ ను తరచూ తింటే మంచిది. ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మహిళలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గతుంది. పన్నీర్ శరీరంలో చేరే టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. జీర్ణ వ్యవస్థ బావుండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. పన్నీర్ ను వారానికి రెండు సార్లు తింటే చాలా మంచిది.
Also read: మామిడి తొక్కలు పడేస్తాం కానీ, వాటిల్లోనే పోషకాలన్నీ
Also read: వ్యాపిస్తున్న BA.4 వేరియంట్, ఈ రెండు లక్షణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే