Paneer Recipe: పనీర్ బర్ఫీ... ఇంట్లోనే ఈ టేస్టీ స్వీట్ సులువుగా చేసేయచ్చు
కరోనావేళ బయటకొనుక్కునే స్వీట్లు కన్నా ఇంట్లోనే శుచిగా చేసుకుంటే మంచిది.
పనీర్ వంటకాలంటే వెజ్, నాన్ వెజ్ తేడా లేకుండా అందరికీ నచ్చుతాయి. భారతీయులు అధికంగా తినే వంటకాల్లో పనీర్ రుచులు అధికమే. పనీర్ వంటల్ని ఇప్పుడు అమెరికాకు పరిచయం చేశారు భారతీయులు. అక్కడ కూడా దీని వాడకం పెరిగిపోయింది. పనీర్ మన ఆరోగ్యానికి చేసే మేలు కూడా అధికం అందుకే దానికంత విలువ. పనీర్ పిల్లలకు, పెద్దలకు ఇద్దరిలోనూ ఎముకలను బలంగా మారుస్తుంది. దీన్ని తరచూ తినే వాళ్లలో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో కూడా పనీర్ లోని సుగుణాలు సహాయపడతాయి. దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అందుకు గుండె పోటు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. పనీర్లో విటమిన్ బి, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మానికి, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేసి యవ్వనాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు ఊడకుండా రక్షిస్తుంది. రోజూ వ్యాయామాలు చేసే వారికి పనీర్ తినడం చాలా అవసరం. కావాల్సిన శక్తిని అందిస్తుంది.
పనీర్ తో ఎప్పుడూ కూరలు, బిర్యానీలు చేసుకుని బోరుకొట్టినవాళ్లు ఈ స్వీట్ రెసిపీ ప్రయత్నించండి. చేయడం చాలా సులువు. రుచి కూడా అదిరిపోతుంది. తక్కువ సమయంలోనే ఇది సిద్ధమైపోతుంది కనుక చేయడం పెద్ద కష్టమనిపించదు.
పనీర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు
పనీర్ తురుము - 400గ్రాములు
పాల పొడి - అర కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ - 300 గ్రాములు
క్రీమ్ మిల్క్ - అరకప్పు
పంచదార - పావుకప్పు
యాలకుల పొడి - అర స్పూను
తయారీ చేసే పద్దతి
స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి మరగబెట్టాలి. అవి కాస్త మరిగాక తురిమిన పనీర్ ను కలపాలి. పాలల్లో పనీర్ కూడా కలిపి కొన్ని నిమిషాలకు అది కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఆ మిశ్రమానికి కండెన్స్‌డ్ పాలు కూడా చేర్చి బాగా కలపాలి. ఇప్పుడు పాల పొడి, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా గరిటెతో తిప్పాలి. ఆ మిశ్రమం గట్టిపడ్డాక స్టవ్ కట్టేయాలి. వేడి తగ్గాక వాటిని బర్ఫీల్లా చేతితో ఒత్తుకోవాలి. పైన పిస్తాలతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: టాటూ వేయించుకుంటున్నారా? అయితే వేయించుకోవడానికి ముందు, తరువాత ఈ పనులు చేయకూడదు