Sweet Recipes: పాకుండలు గుర్తున్నాయా? ఒకప్పటి పండగ స్వీట్
ఒకప్పుడు తెలుగిళ్లల్లో కచ్చితంగా చేసే స్వీట్ పాకుండలు
చూడటానికి బూరెల్లా కనిపిస్తున్నాయి కదా వీటిని పాకుండలు అంటారు. ఒకప్పుడు ఆంధ్రాలో సంక్రాంతి వస్తే చాలు అందరిళ్లల్లో కచ్చితంగా వండే స్వీట్ ఇది. వండాక పాడుతుందన్న బాధ లేదు. రెండు మూడు వారాలు తాజాగా ఉంటుంది. పైగా తినడం వల్ల ఎంతో బలం కూడా. ముఖ్యంగా దీన్ని ఉత్తరాంధ్రలో వండుతారు. దీన్ని తయారుచేయడం పెద్ధ కష్టం కాదు. ఎవరైనీ వీటిని సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. కావాలంటే రెసిపీపై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు
తడి బియ్యప్పిండి - రెండు కప్పులు
కొబ్బరి తురుము - అయిదు స్పూన్లు
తురిమిని బెల్లం - ఒక కప్పు
నెయ్యి - ఒక స్పూను
యాలకుల పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ ఇలా
1. పాకుండల తయారీకి కచ్చితంగా తడి బియ్యప్పిండినే వాడాలి. ఇందుకు రాత్రంతా బియ్యం నానబెట్టి ఉదయం నీళ్లు వంపేసి తడి బియ్యాన్ని ఆరబెట్టాలి. యాభైశాతం తడి ఆరాక పొడిలా చేసుకోవాలి.
2. బియ్యం తడిగా ఉన్నప్పుడే పాకుండలను వండేయాలి. తడి లేకపోతే ఇవి రుచికరంగా రావు.
3. స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం తురుము వేసి కాస్త నీళ్లు పోసి పాకం తీయాలి.
4. పాకం వచ్చాక తడి బియ్యంపిండిని కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి.
5.ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి.
6. అందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి.
7. మిశ్రమం దగ్గరగా గట్టిగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
8. మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
9. స్టవ్ పై మరో కళాయి పెట్టుకుని అందులో నూనె వేయాలి.
10. ఆ నూనెలో ఉండలను డీప్ గా వేయించాలి. బంగారు రంగు వచ్చాక తీసేయాలి. అంతే పాకుండలు రెడీ అయినట్టే.
తింటే ఎన్ని లాభాలో...
పాకుండలు ముఖ్యమైన పదార్థాలు బియ్యప్పిండి, బెల్లం. ఈ రెండు కూడా శరీరానికి శక్తిని అందించేవే. బెల్లం రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు శరీరానికి ఇనుమును అందిస్తుంది. దీని వల్ల ఎర్రరక్త కణాలు పెరుగుతాయి. రక్త హీనత సమస్య దరి చేరదు. బియ్యంప్పిండిలో ప్రొటీన్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇక ఇందులో వాడిన యాలకులు కూడా నోటి దుర్వాసనను పోగొడతాయి. ఇక కొబ్బరిలో కూడా ఫైబర్ ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ అధికంగా విడుదల కాదు. డయాబెటిస్ ఉన్నవారికి కొబ్బరి ఎంతో మేలు చేస్తుంది. శరీరం బాగా అలిసిపోయినప్పుడు పాకుండలు తింటే వెంటనే శక్తి అందుతుంది. ఇందులో వాడే నెయ్యి చాలా తక్కువే కాబట్టి దాని వల్ల బరువు పెరుగుతామేమో అన్న సందేహం అవసరం లేదు. ఈ స్వీట్ ఉత్తరాంధ్ర వారికి బాగా పరిచయమైన వంటే, తెలంగాణా వారిలో ఎంతమందికో ఈ స్వీట్ తెలుసో మరి. ఇప్పటివరకు తినని వారో ఒకసారి చేసుకుని తింటే టేస్టు అదిరిపోతుంది.
Also read: పావురాలను జాంబీలుగా మార్చేస్తున్న మిస్టిరియస్ వ్యాధి, మనుషులకు సోకుతుందా?