Womens Day 2022: ఆడవాళ్లకూ మెరుగైన జీతం - జీవితం కోసమే పుట్టుకొచ్చింది మహిళా దినోత్సవం, తొలి అడుగు పడింది ఆ దేశంలోనే
ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటాం, దాని వెనుక కథ ఇదే.
ఏ ఉద్యమమైన మొదలయ్యేది ఒక్క మనిషితోనే, అతడు వేసే మొదటి అడుగుతోనే. కానీ మహిళ దినోత్సవం పుట్టుక వెనుక మాత్రం 15 వేల మంది అతివల అడుగులు ఉన్నాయి. పురుషులతో సమానమైన హక్కుల కోసం 1908లో న్యూయార్క్ లో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. తమకు కూడా మగవారితో సమానంగా జీతాలు ఇవ్వాలని, ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఇంట్లోని బాధ్యతలు కూడా చూసుకోవాలి కనుక పనిగంటలు కుదించాలని ధర్నా చేశారు. ఆ ధర్నా వల్ల వారికి ఒరిగిందేమీ లేకపోయినా మహిళలకంటూ ఓ ప్రత్యేక దినం ఉండాలని మాత్రం ఆలోచన వచ్చింది కొంతమందికి. అలా 1909లోనే అమెరికాకు చెందిన సోషలిస్టు పార్టీ జాతీయ మహిళ దినోత్సవాన్ని ప్రకటించింది. కాకపోతే అది కేవలం అమెరికా దేశానికే పరిమితమైంది.
ఆమె ఆలోచన వల్లే...
అమెరికా జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది మాత్రం క్లారా జెట్కిన్ అనే మహిళ. ఆమె 1910లో కోపెన్ హాగెన్ లోని జరిగి ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచస్థాయిలో ఆడవాళ్ల కోసం ఒక ప్రత్యేక దినోత్సవం కావాలని పట్టుబట్టారు. ఆ సదస్సులో దాదాపు 100 మంది మహిళలు ఉన్నారు. వారంతా వివిధ దేశాల నుంచి వచ్చినవారే. క్లారా ఆలోచన వారికి కూడా నచ్చి ఒప్పుకున్నారు. అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించింది.
తొలిసారి ఎప్పుడంటే...
తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911లో నిర్వహించుకున్నారు. అమెరికాతో పాటూ డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో తొలిసారి నిర్వహించారు. అంటే గత 122 ఏళ్లుగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
అధికారికంగా...
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది 1975లోనే. ఆ ఏడాది నుంచి ఇది మహిళల పండుగల మారిపోయింది. ఎన్నో దేశాలు అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? వివక్షను బద్దలు కొట్టడం (బ్రేక్ ద బయాస్).
మార్చి8నే ఎందుకు?
ఈ విషయం చెప్పేందుకు ఎక్కడా సరైన వివరణ లేదు. ఎందుకంటే చరిత్రలో మహిళలు చేసిన ఏ ఉద్యమం కూడా మార్చి 8న జరిగినట్టు లేదు. అయితే రష్యాలో 1917 ఫిబ్రవరిలో మహిళలు శాంతి, ఆహారాన్ని కోరుతూ రోడ్డెక్కారు. కాకపోతే గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఆ రోజు మార్చి 8. అందుకే ఆరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చి ఉండొచ్చు. అంతకుముందు 1914 నుంచే మార్చి 8న ఈ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి.
Also read: మహిళా దినోత్సవం, ఈ అందమైన కోట్స్‌తో వనితామణులను విష్ చేయండి