Tandoori Roti: రెస్టారెంట్లో తందూరి రోటీలను ఆర్డర్ చేస్తున్నారా? వాటితో వచ్చే ఆరోగ్య ప్రమాదాలు ఇవే
తందూరి రోటీలను ఇష్టంగా తినే వాళ్ళు ఎంతోమంది. కానీ వాటి వల్ల కలిగే ముప్పును మాత్రం వారు అంచనా వేయలేరు.
తందూరి రోటి... సాంప్రదాయ భారతీయ బ్రెడ్. దీన్ని పప్పు, కడాయి పనీర్, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ వంటి వాటితో జత చేసి తింటే రుచి అదిరిపోతుంది. అందుకే వీటికి అభిమానులు ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్లు, పార్టీల్లో కచ్చితంగా తందూరి రోటీ దర్శనమిస్తుంది. ఇవి చాలా స్పెషల్ గా తయారవుతాయి. వీటిని మట్టితో నిర్మించిన పెద్ద పొయ్యిల్లో కాలుస్తారు. అందుకే బొగ్గు వాసన వస్తుంది. ఇవి టేస్టీగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చేసే కీడు ఎంతో.
తయారీ ఇలా
తందూరి రోటీలను మైదాతో తయారుచేస్తారు. మైదాలో పెరుగు, వెన్న, నిగెల్లా గింజలు వేసి చేస్తారు. కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు చాలా అధికంగా ఉంటాయి. మైదాతో చేసే ఏ వంటకాలైనా ఆరోగ్యానికి ప్రమాదమే. వీటిలో అనారోగ్య కొవ్వు అధికంగా ఉంటుంది.
ఎందుకు హానికరం?
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మైదాతో చేసే ఈ తందూరి రోటి పేగుల ఆరోగ్యానికి హానికరం. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ట్రై గ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వంటివి వస్తాయి.
మైదాను అధికంగా వాడడం వల్ల మీ శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. మైదాను తరచుగా తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీర్ఘకాలంగా వీటిని తింటే టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
రెస్టారెంట్లో బొగ్గు, కలప పెట్టి తందూరి రోటీలను కాలుస్తారు. ఇది వాయు కాలుష్యానికి కారణం అవుతుంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం బొగ్గు, కలప వంటి ఇంధనాలతో వండిన వంటకాలు తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వంట కోసం ఇలాంటి ఇంధనాలను ఉపయోగిస్తే గుండెపోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్ తో మరణించే వారి సంఖ్య 12 శాతం ఎక్కువగా ఉంది.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల ఒత్తిడి, నిరాశ పెరుగుతుంది. వీటిలో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది సాగే లక్షణం కలది.చిన్న పేగులకు నష్టాన్ని కలిగిస్తుంది.సెలియాక్ డిసీస్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అందుకే మైదాతో చేసే తందూరీ రోటీ తినడాన్ని తగ్గించాలి. వీలైతే మానేయాలి. గోధుమ పిండితో చేసే చపాతీలు, రోటీలకే ప్రాధాన్యత ఇవ్వాలి. నాలుక రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
Also read: ఈ మహిళ రోజుకు కిలో వెన్న తినేసి, లీటర్ నూనె తాగేస్తోంది - ఆమెది ఓ విచిత్ర తిండి రోగం
Also read: ఆరేళ్ల బాలికకు వింత వ్యాధి, ఈమె శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.