Obesity: ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు, బరువు తగ్గాల్సిందే
ఊబకాయంతో పాటూ అనేక ఆరోగ్య సమస్యలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.
ఊబకాయం... ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి. ఏటా ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో పెరుగుతూ వస్తోంది. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 65 కోట్ల మందికి పైగా పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇక వీరు కాకుండా అధిక బరువుతో ఉన్న వారు 140 కోట్ల మంది వరకు ఉన్నారు. బరువు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆరోగ్యసమస్యలు కూడా పెరుగుతాయి. కొన్నేళ్ల క్రితం వరకు ఊబకాయాన్ని ఒక వ్యాధిలా ఎవరూ చూడలేదు. కానీ 2013లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ దీన్ని ఒక వ్యాధిగా పరిగణించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికీ దీన్ని వ్యాధిగా గుర్తించే ప్రజలు తక్కువ మందే ఉన్నారు.
క్యాన్సర్ వచ్చే అవకాశం
ఊబకాయం జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తెలియజేశాయి. తల్లిదండ్రులు, తాతలు చాలా లావుగా ఉంటే వారి పిల్లలు, మనవలు కూడా బొద్దుగా పుట్టే అవకాశం ఉంది. అయితే ఇది చాలా కొద్ది మందిలో జరిగే ప్రక్రియ. అధిక శాతం ఊబకాయుల్లో మాత్రం కేవలం వారు ఎంచుకున్న జీవన విధానమే కారణం. ఊబకాయం వల్ల కేవలం మధుమేహం, అధికరక్తపోటు వంటి రోగాలే కాదు, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఊబకాయాన్ని తగ్గించుకుంటే ప్రపంచంలో 37.7 శాతం క్యాన్సర్ కేసులు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పదమూడు రకాల క్యాన్సర్లు
ఇంతవరకు ఊబకాయం వల్ల టైప్2 డయాబెటిస్, గుండె సంబంధించి కొన్ని రోగాలు మాత్రమే వస్తాయని భావించారు చాలా మంది. కానీ శరీరం లోపల క్యాన్సర్ కణితులు పెరిగేందుకు కూడా ఇది సహకరిస్తుందని ఇప్పుడు తేలింది. పొగతాగడం వల్ల క్యాన్సర్ రావడానికి ఎంత అవకాశం ఉందో, ఊబకాయం వల్ల కూడా అంతే ఛాన్సులు ఉన్నాయి. ఊబకాయం శరీరంలోని కొన్ని అత్యవసరమైన కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో క్యాన్సర్ కణజాలం పెరగడానికి దారి తీస్తుంది. శరీరంలో పెరిగే అధిక బరువు పదమూడు రకాల క్యాన్సర్లకు కారణం కావచ్చని చెబుతోంది బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ. కాబట్టి ధూమపానం, మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలను తినడం, అధిక ప్రాసెస్ట్ ఆహారాన్ని తినడం వంటి పనులు తగ్గించుకోవాలి. మీ ఎత్తుకు తగ్గ బరువును మెయింటేన్ చేస్తూ అధిక బరువు, ఊబకాయం బారిన పడకుండా కాపాడుకోవాలి.
- డాక్టర్ నాగప్రియ వెల్లలచెరువు
ఎండోక్రైనాలజిస్టు
SPS ఎండోక్రైన్ హాస్పిటల్
నరసరావుపేట
Also read: సల్మాన్ ఖాన్‌కున్న ఆరోగ్య సమస్య ఇదే, ఇదో వింత రోగం
Also read: ఆహారం, నీళ్లు మింగడం కష్టంగా ఉందా? అది చాలా డేంజరస్ సంకేతం