(Source: ECI/ABP News/ABP Majha)
Pig Kidney To Human Body: వైద్య చరిత్రలో మరో అద్భుతం - మనిషికి పంది కిడ్నీ పెట్టిన వైద్యులు, సర్జరీ సక్సెస్!
గత ఏడాది ఒక వ్యక్తికి పంది గుండెని అమర్చారు. ఆపరేషన్ విజయవంతం అయ్యింది కానీ అనుకోని కారణాల అతను మరణించాడు. తాజాగా మరొక వ్యక్తికి పంది కిడ్నీ అమర్చారు.
వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కారం కాబోతుంది. మనుషులకి జంతువుల అవయవాలు మార్పిడి చేస్తే ఎలా పని చేస్తున్నాయనే దాని మీద వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. అందులో కొంతవరకు విజయం సాధించారనే చెప్పవచ్చు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి పంది కిడ్నీ పెట్టి ఆపరేషన్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నెల రోజులుగా ఎటువంటి అవాంతరాలు లేకుండా పని చేస్తుంది. న్యూయార్క్ కి చెందిన వైద్యులు ఈ ప్రయోగం చేపట్టారు.
జంతువుల అవయవాలు మనుషులకి సరిపోతాయా లేదా? వాటిని మానవ శరీరంలో పెడితే ఎలా పని చేస్తాయనే దాని మీద న్యూయార్క్ కి చెందిన వైద్యులు కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. లాంగోన్ హెల్త్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీ పెట్టి ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది మానవ కిడ్నీ మాదిరిగానే చక్కగా పని చేస్తుంది. కిడ్నీ పెట్టి ఇప్పటికీ నెలరోజులు. ఒక విధంగా చెప్పాలంటే మనిషి కిడ్నీ కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందని ఈ ఆపరేషన్ లో భాగమైన డాక్టర్ మోంట్ గోమేరీ వెల్లడించారు. జులై 14న ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. సదరు వ్యక్తి శరీరంలో పంది కిడ్నీ పెట్టగానే వెంటనే పని చేయడం ప్రారంభించింది.
న్యూయార్క్ కి చెందిన 57 ఏళ్ల మౌరిస్ మో అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతనికి ఆ పరిస్థితి రాక ముందే కుటుంబ సభ్యులకి తన బాడీనిన్ మెడికల్ ఎక్స్పర్మెంట్ కోసం ఉపయోగించడానికి దానం చేయమని చెప్పాడు. అందువల్ల అతడి శరీరాన్ని వైద్యులు ఈ విధంగా ఉపయోగించుకున్నారు. అతని శరీరంలోని పంది కిడ్నీ అమర్చి అది ఎలా పని చేస్తుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు రెండో నెల నడుస్తుందట. ఇంరా ఎన్ని రోజుల పాటు కిడ్నీ పని చేస్తుందనేది వైద్యులు పరిశీలించనున్నారు. జంతువుల ఆర్గాన్స్ మనిషికి అమర్చడం వల్ల ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ విషయం మీద అనేక పరిశోధనలు కూడా జరిగాయి.
రోగనిరోధక వ్యవస్థ వేరే మానవ అవయవాన్ని వేగంగా తిరస్కరిస్తుంది. అందుకే మానవ అవయవాలకు బదులు జంతు ఆర్గాన్స్ పెట్టేందుకు వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే జన్యు మార్పిడి చేసిన పందులని అభివృద్ధి చేస్తున్నారు. వాటి అవయవాలు మానవులకి బాగా సరిపోతున్నాయి. గత ఏడాది మేరీల్యాండ్ కి చెందిన వైద్యులు పంది గుండెని 57 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. రెండు నెలల పాటు అతను బతికే ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గుండెలో ఇన్ఫెక్షన్ చేరడంతో అతడు ప్రాణాలు విడిచాడు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మధుమేహులూ ఈ షుగర్‌ని ఏ భయం లేకుండా తినొచ్చు!