Monk Fruit Sugar: మధుమేహులూ ఈ షుగర్‌ని ఏ భయం లేకుండా తినొచ్చు!
డయాబెటిస్ బాధితులు పంచదార అసలు తీసుకోకూడదు. కానీ ఈ పంచదార మాత్రం నిరభ్యంతరంగా తినేయచ్చు. డయాబెటిస్ పెరుగుతుందనే ఆందోళనే వద్దంటున్నారు నిపుణులు.
వైట్ పాయిజన్.. అందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. అదేంటి పాయిజన్ ఇష్టంగా తినడం అనుకుంటున్నారా? అదేనండీ పంచదార. పానీయాల దగ్గర నుంచి డెజర్ట్ వరకు తినే ప్రతి దానిలో షుగర్ ఒక అంతర్భాగం అయిపోయింది. పంచదార ఆరోగ్యకరం కాదని తెలిసినా కూడా దాన్ని తినడం మాత్రం తగ్గించరు. ఇందులో కేలరీలు ఎక్కువ. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయనికి దారి తీస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది. అది మాత్రమే కాదు ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ ని పెంచేసి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే దీన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలని చెప్తుంటారు. కొంతమంది పంచదారకి ప్రత్యామ్నాయంగా ఆర్టిఫిషియల్ స్వీటేనర్స్ మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా మధుమేహులు తమ చక్కెర కోరికలు అణుచుకోలేని వాళ్ళు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.
స్వీటేనర్లు ఆరోగ్యకరం కాదా?
చక్కెర ప్రత్యామ్నాయంగా తీసుకునే కృత్రిమ స్వీటేనర్లు కూడా ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియకి అంతరాయం కలుగుతుందని చెబుతున్నాయి. తీపి తినాలనే కొరికల్ని మరింత పెంచి బరువు పెరిగేందుకు దారి తీసేలా చేస్తుంది. గట్ మైక్రోబయోటా మీద ప్రభావం చూపుతాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటికి బదులుగా ఎటువంటి ఇబ్బందులు లేని మాంక్ ఫ్రూట్ షుగర్ వాడమని చెప్తున్నారు నిపుణులు. సంతోషం కలిగించే మరొక విషయం ఏమిటంటే మధుమేహులు కూడా ఈ పంచదార తినొచ్చు.
మాంక్ ఫ్రూట్ షుగర్ ప్రయోజనాలు
మాంక్ ఫ్రూట్ నుంచి ఈ పంచదార తయారు చేస్తారు. మొక్క నుంచి వచ్చే సహజ స్వీటేనర్. ఈ పండు చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. చైనా, థాయిలాండ్ వంటి కొన్ని ప్రాంతాలకి చెందినది. సంప్రదాయ చైనీస్ ఔషధాల్లో దీన్ని ఎన్నో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది షుగర్ కి మంచి ప్రత్యామ్నాయంగా ప్రజాదరణ పొందింది. ఇప్పుడిప్పుడే దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి కేలరీలు జోడించకుండా తీపి రుచిని ఇది అందిస్తుంది. మోగ్రోసైడ్స్ అనే సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. అందుకే వాటికి రుచి తీపిగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలని అనుకునే వాళ్ళకి, తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. ఇందులో ఉండే ఎరిథ్రిటాల్ అనేది షుగర్ ఆల్కహాల్, ఇది జీరో గ్లైసెమిక్ ఇండెక్స్.
నిజంగా ఇది సురక్షితమేనా?
మాంక్ ఫ్రూట్ స్వీటేనర్ అనేది మన దగ్గర చాలా కొత్తది. 2010 వరకు దీన్ని ఎఫ్ డీఏ సురక్షితమైనదిగా పరిగణించలేదు. దీని తీపి టేబుల్ షుగర్ కంటే తియ్యగా ఉంటుంది. జీరో కేలరీలు కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ దీనిపై మరింత పరిశోధన అవసరం. మాంక్ ఫ్రూట్ స్వీటేనర్ ని ఇప్పుడిప్పుడే సాధారణంగా సురక్షితంగా పరిగణిస్తున్నారు. అయితే ఏదైనా అలర్జీలు ఉంటే మాత్రం దీన్ని తీసుకోకపోవడమే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వీటిని నెయ్యితో కలిపి తీసుకుంటే ఏ మందులూ వాడక్కర్లేదు