Oral Health: నోరు శుభ్రంగా ఉంచుకోవడం లేదా? జాగ్రత్త మతిమరుపు రావడం ఖాయం
చిగుళ్ళ వ్యాధులు, నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుందట. మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మెదడుని అమిలాయిడ్ ఫలకం నుంచి రక్షించే కణాలలో మార్పులు చోటు చేసుకుంటాయని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నోటి బ్యాక్టీరియా సెల్ డెత్, అల్జీమర్స్ వ్యాధి ఉన్న వ్యక్తుల్లో చిత్త వైకల్యం ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. చిగుళ్ళ వ్యాధులు, దంత క్షయం వంటి సమస్యల వల్ల డీమెన్షియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
చిగుళ్ళ వ్యాధులు ఏంటి?
చిగుళ్ళ వాపు, పుండ్లు లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఎంతో మంది ప్రజలు చిగుళ్ళ వ్యాధి బారిన పడుతున్నారు. ఎక్కువగా యుక్తవయసు వాళ్ళు ప్రభావితంఅవుతున్నారు. చిగుళ్ళ వ్యాధి సాధారణ సంకేతాలు ఏమిటంటే- బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్త స్రావం, బ్రషింగ్ తర్వాత నోటి దుర్వాసన, ముదురు ఊదా రంగు చిగుళ్ళు, పళ్ల నుంచి రక్తం కారడం వంటివి ఎదురవుతాయి. ఇవి రెండు దశలుగా ఉంటాయి.
చిగురు వాపు
చిగుళ్ళ వాపుకి కారణమయ్యే వ్యాధి సాధారణ రూపం. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల దంతాలు, చిగుళ్ళపై ఫలకం పేరుకుపోతుంది. చిగుళ్ళ వాపు లక్షణాలు చిగుళ్ళు ఎర్రగా మారడం, వాపు, సున్నితత్వం. చిగుళ్ళ నుంచి త్వరగా రక్తం కారుతుంది. బ్రషింగ్ చేసే సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది.
చికిత్స చేయకుండా వదిలేస్తే చిగురు వాపు పీరియాడోంటైటిస్ గా మారుతుంది. ఇది దంతాల్ని బలహీనపరుస్తుంది. దంతాల స్థిరత్వానికి అవసరమైన చిగుళ్ళు, ఎముకలు, ఇతర కణజాలాల నిర్మాణాల విచ్చిన్నానికి దారి తీస్తుంది. పీరియాడోంటైటిస్ వచ్చి వ్యక్తులు ఆహారం నమలడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే నోరు ఎప్పుడు దుర్వాసనతో ఇబ్బంది పెడుతుంది.
చిగుళ్ళ వ్యాధి కారకాలు
చిగుళ్ళ వ్యాధి అనేక కారణాల వల్ల వస్తుంది. వాటిలో అత్యంత సాధారణమైంది నోటి పరిశుభ్రత. సరిగా బ్రష్ చేయకపోవడం, ఫ్లాసింగ్ చేయడం వల్ల ఫలకం ఏర్పడి చిగుళ్ళ వ్యాధి వస్తుంది. ఫ్లేక్ వంటి పొర చిగుళ్ళ మీద ఏర్పడి వాటిని బలహీనపరుస్తుంది.
హార్మోన్లలో మార్పులు కూడా ఈ వ్యాధులని తీసుకొస్తాయి. రుతువిరతి, నెలసరిలో మార్పులు, గర్భధారణ సమయంలో కూడా చిగుళ్ళు సున్నితంగా మారిపోతాయి. వాపు ప్రమాదాన్ని పెంచుతాయి.
లాలాజల ఉత్పత్తిని తగ్గించే మందులు నోటి శుభ్రతని ప్రభావితం చేస్తాయి. ఎపిలెప్సీ ని తగ్గించేందుకు ఉపయోగించే డీలాంటిన్ వంటి కొన్ని మందులు చిగుళ్ళ కణజాలం మీద వాపుని ఏర్పరుస్తాయి. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వ్యక్తులలో ఫలకం ఏర్పడటం వల్ల కణాల మరణం, మతిమరుపు వంటివి సంభవించవచ్చు. యునైటెడ్ స్టేట్స్ చేసిన పరిశోధన ప్రకారం నోటి బ్యాక్టీరియా మెదడులోకి చొరబడుతుంది. నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకోవడం సవాలుతో కూడుకున్న విషయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసి మతిమరుపుకి కారణమవుతున్నాయి. గతంలో ఇదే విధంగా నోటి పరిశుభ్రతకి మెదడు మధ్య ఉన్న లింకుని తెలియజేస్తూ పలు అధ్యయనాలు వచ్చాయి. అవి కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని నిపుణులు తెలిపారు.
నోటి శుభ్రత కేవలం దంతాల వరకు మాత్రమే పరిమితం కాదని ఇది మొత్తం ఆరోగ్య శ్రేయస్సు మీద ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే తప్పనిసరిగా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గతంలో నోటి అపరిశుభ్రత వల్ల కొలోన్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో ముడి పడి ఉందనే దానికి సంబంధించిన పరిశోధన వెలుగులోకి వచ్చిన విషయాన్ని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: జుట్టు బలంగా ఉండాలంటే మీ స్కాల్ఫ్ శుభ్రంగా ఉంచుకోవాల్సిందే