Scalf Protection: జుట్టు బలంగా ఉండాలంటే మీ స్కాల్ఫ్ శుభ్రంగా ఉంచుకోవాల్సిందే
ఇంట్లో సింపుల్ గా దొరికే పదార్థాలతోనే మీ తల మాడు శుభ్రం చేసుకోవచ్చు. పొడవైన జుట్టు పొందవచ్చు.
మెరిసే జుట్టుకి ఆరోగ్యకరమైన స్కాల్ఫ్ అవసరం. అప్పుడే వెంట్రుకలు ధృడంగా ఆరోగ్యంగా ఉంటాయి. స్కాల్ఫ్ శుభ్రంగా లేకపోతే చుండ్రు, తల దురద వేధిస్తాయి. మురికిగా ఉన్న మాడు వల్ల జుట్టు కుదుళ్లు కూడా బలహీనపడిపోయి వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ మాడు శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం ఈ సహజ మార్గాలు ఎంచుకోండి.
రెగ్యులర్ వాషింగ్: వారానికి ఒక సారి కాకుండా రెండు, మూడు సార్లు జుట్టుని క్రమం తప్పకుండా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. కఠినమైన షాంపూ కాకుండా సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. అది మీ స్కాల్ఫ్ నుంచి అదనపు నూనె, మురికి, చెత్తను తొలగించడంలో సహాయపడుతుంది.
యాపిల్ సిడర్ వెనిగర్: జుట్టుని శుభ్రం చేసుకునేందుకు ఇది చక్కగా పని చేస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్ ని నీటిలో కరిగించి జుట్టుకి పట్టించాలి. ఆ తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. దీని ఆమ్లత్వం స్కాల్ఫ్ pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మాడు మీద పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.
అలోవెరా జెల్: జుట్టు సంరక్షణ విషయంలో అలోవెరా జెల్ ని మించింది మరొకటి ఉండదు. తల చికాకు, దురద, చుండ్రు సమస్యల్ని నయం చేస్తుంది. తాజా కలబంద జెల్ ని నేరుగా తలకి అప్లై చేసుకోవాలి. దాని సహజ ఎంజైమ్ లు అదనపు సెబమ్, మలినాలని తొలగించేస్తాయి.
టీ ట్రీ ఆయిల్: షాంపూ లేదా కండిషనర్ లో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ జోడించుకుని తలకి పట్టించాలి. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని తొలగించి శుభ్రమైన స్కాల్ఫ్ ని అందిస్తాయి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా కొద్దిగా తీసుకుని అందులో కాసిన్ని నీళ్ళు వేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. దాన్ని తలపై సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇది సహజమైన ఎక్స్ ఫోలియెంట్ గా పని చేస్తుంది. మృత కణాలను, అదనపు నూనెని తొలగించడంలో సహాయపడుతుంది.
వేప నూనె: ఎన్నో ఏళ్లుగా జుట్టు సంరక్షణ అద్భుతంగా పని చేస్తుంది వేప నూనె. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. క్యారియర్ ఆయిల్ తో కొన్ని చుక్కలు కలుపుకోవాలి. దీన్ని బాగా తలకి పట్టించి మర్దన చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచిది.
స్కాల్ఫ్ మసాజ్: రక్త ప్రసరణ మెరుగుపరచడానికి తలకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇది దుమ్ము, ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది. చేతి వేళ్ళతో కుదుళ్ళ నుంచి సున్నితంగా మసాజ్ చేయాలి.
నిమ్మరసం: నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి జుట్టుకి పట్టించాలి. ఇందులోని సహజ ఆమ్ల గుణాలు వెంట్రుకల్ని శుభ్రపరిచి జిడ్డుని తొలగించడంలో సహాయపడతాయి.
కొబ్బరి నూనె మాస్క్: గోరువెచ్చని కొబ్బరి నూనె తలకి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. కొన్ని గంటలు లేదా రాత్రి పూట అలాగే ఉంచుకోవాలి. ఇది స్కాల్ఫ్ కి పోషణ అందించడమే కాదు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పెప్పర్ మింట్ ఆయిల్: షాంపూ లేదా కండిషనర్ లో కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని తలకి పట్టిస్తే రిఫ్రెష్ భావన కలుగుతుంది. స్కాల్ఫ్ ని శుభ్రం చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: షాకింగ్ అధ్యయనం- ఐవీఎఫ్ వల్ల మహిళల్లో స్ట్రోక్ ప్రమాదం!