(Source: ECI/ABP News/ABP Majha)
Belly Fat: బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలా? ఈ ఒక్క జ్యూస్ తో బొజ్జ తగ్గించుకోవచ్చు
శరీరంలో కొవ్వు పేరుకుపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అది గుండెకి చేటు చేస్తుంది.
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటారు. ఇప్పుడు యాపిల్ జ్యూస్ తాగితే మీ బొజ్జ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవచ్చని చెబుతోంది కొత్త అధ్యయనం. యాపిల్ లోని పాలీఫెనాల్స్ శరీర కొవ్వుని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు.
అధ్యయనం సాగింది ఇలా..
అధ్యయనంలో పాల్గొన్న వారితో యాపిల్ జ్యూస్ ని ఎనిమిది వారాల పాటు తాగించారు. ఇది తాగిన తర్వాత విసెరల్ ఫ్యాట్ ప్రాంతంలో తేడాను పరిశోధకులు గమనించారు. పాలిఫెనాల్ అధికంగా ఉండే పానీయం దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడంలో గణనీయమైన మార్పులు చూశారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం వల్ల అనేక ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది కార్డియో వాస్కులర్, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో మంటని పెంచుతుంది.
ఊబకాయం ఉన్న దాదాపు 94 మందికి ప్రతిరోజు ఒక సీసాలో యాపిల్ పాలీఫెనాల్స్ అందించారు. మరో 30 మందికి 4 వారాల పాటు మూడు సీసాల యాపిల్ జ్యూస్ ఇచ్చారు. అలా 12 వారాల పాటు వాళ్ళని పరిశీలించారు. తర్వాత వారికి సీటీ స్కానింగ్ చేసి ఫలితాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. అందులో పొట్ట దగ్గర కొవ్వు తగ్గినట్టు తేలింది.
యాపిల్ వల్ల ప్రయోజనాలు
యాపిల్ లో మంచి ఫైబర్, పెక్టిన్ ఉంటుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఊబకాయం, బొడ్డు చుట్టూ వచ్చే కొవ్వుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాని వల్ల ఆహారం తినడం తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గుతారు. మరొక అధ్యయనంలో 74 మంది పెద్దలు రాత్రిపూట నారింజ రసం తీసుకున్నారు. ఇందులో కూడా 5-20 గ్రాముల పెక్టిన్ పొందారు. అతి తక్కువ మోతాదులో దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు.
100 గ్రాముల యాపిల్ లో 19 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పాలీఫెనాల్స్ కి మంచి మూలం. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో పాలీఫెనాల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక మీడియం సైజు యాపిల్ లో 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. యాపిల్ నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే తప్పకుండా తొక్కతో కలిపి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెక్టిన్, డైటరీ ఫైబర్ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలని తగ్గిస్తాయి. పేగు పనితీరుని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యని నివారిస్తాయి. పెక్టిన్ గ్యాస్ట్రిక్ ఆమ్లంతో కలిసి ప్రీబయోటిక్ గా మారతాయి. ఇవి గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. యాపిల్ లేదా సిట్రస్ పండ్ల నుంచి వచ్చే పెక్టిన్ లు గట్ బ్యాక్టీరియాకు విలువైన కార్బన్ మూలాలు అని గతంలోని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. గట్ హెల్త్ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.