Sleeping Problem: ఏవేవో ఆలోచనలతో నిద్ర పట్టడం లేదా? ఈ నేవీ టెక్నిక్‌తో కళ్లు వాటికవే మూతలు పడిపోతాయ్!
రాత్రిళ్లు నిద్రపోకుండా కళ్లు తెరిచి ఆలోచిస్తున్నారా? నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ టెక్నిక్‌ను పాటించాల్సిందే.
పరీక్షలకు ముందు రోజు రాత్రి మీరు హాయిగా నిద్రపోగలిగారా? రేపు ఎగ్జాగ్ ఎలా రాస్తమో, ఏయే ప్రశ్నలు వస్తాయో ఏమో అనే టెన్షన్‌తో సరిగ్గా నిద్రపోయి ఉండరు కదూ. ఇంటర్వ్యూల సమయంలో కూడా బుర్రలో ఏవేవో ఆలోచనలు నిద్రలేకుండా చేస్తాయి. అవే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకు ఉన్నంత ఫీలింగ్ కూడా కలుగుతుంది. కళ్లు బలవంతంగా మూసినా సరే.. మన మెదడు మాత్రం ఆలోచించడం మానదు. దానివల్ల చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. అయితే, ఇదే పెద్ద రోగమని కంగారు మాత్రం పడొద్దు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కిటుకులు ఉన్నాయి.
అతి ఆలోచనల వల్ల చాలామంది అర్ధరాత్రిళ్లు లేదా తెల్లవారుజామునే నిద్రలేస్తారు. తమలో మెదలుతున్న ఆలోచనలను ఆపలేక సతమతం అవుతారు. రాత్రివేళ అతిగా ఆలోచించే అలవాటును వైద్య పరిభాషలో ‘ఇన్సోమియా’ అని అంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నవారికి నిద్రపట్టదు. కళ్లు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ.. ఏదేదో ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచనలు కూడా చాలావరకు పనికిరానివే అవుతాయి. కొందరు టెన్షన్‌తో మరికొందరు ఉద్వేగంతో, ఏదో జరిగిపోతుందన్నట్లుగా కొందరు నిద్రపోలేరు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ‘BOX’ బ్రీథింగ్ అనే ప్రక్రియను పాటించాలి. దీన్నే స్క్వేర్ బ్రీతింగ్, నేవీ సీల్ బ్రీతింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. సముద్రంలో ప్రయాణించేప్పుడు నావికులు లేదా నౌకాదళం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు. దాని నుంచి బయటపడి, కాసేపు హాయిగా నిద్రపోవడం కోసం ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు. దీని వల్ల మెదడుకు కొన్ని సంకేతాలు అందుతాయి. దానివల్ల మెదడు వెంటనే కేంద్ర నాడీ మండలాన్ని విశ్రాంతి తీసుకోడానికి ప్రేరేపిస్తుంది.
‘బాక్స్ బ్రీతింగ్’ ఇలా చేయాలి:
ఈ ప్రక్రియ పేరులోనే ‘బాక్స్’ ఉంది. కాబట్టి, మీరు ఒక బాక్స్ లేదా చతురస్రాన్ని ఊహించుకోవాలి.
ఆ చతురస్రంలోని ఒక్కో కోణాన్ని ఒక్కోలా ఊహించుకోవాలి. వాటిలో ఒక కోణం ‘ఊపిరి పీల్చడం’, రెండోది ‘ఊపిరి బిగపట్టడం’, మూడోది ‘ఊపిరి వదలడం’, నాలుగోది ‘రిలాక్స్’ కావడం.
ఊపిరి పీల్చడం: మీరు ఊహించుకున్న బాక్సులో ఒక కోణాన్ని చూస్తున్నట్లుగా మీ ముక్కుతో గాలిని పీల్చుకోండి. మీ పొట్ట మీద చేయి పెట్టుకుని.. నాలుగు అంకెలు లెక్కపెడుతూ.. ఆ ఊపిరిని ఫీలవ్వండి.
ఊపిరి బిగపట్టండి: ఆ తర్వాత మీ ఊపిరిని కాసేపు బిగపట్టండి. ఆ తర్వాత మరో నాలుగు అంకెలు లెక్కపెట్టండి.
ఊపిరి వదలండి: మీరు బిగపట్టిన ఊపిరిని నాలుగు అంకెలు లెక్కపెడుతూ నెమ్మదిగా వదలండి.
రిలాక్స్ అవ్వండి: ఊపిరి బయటకు వదిలేసిన తర్వాత కాసేపు ఊపిరి పీల్చడం గానీ, వదలడం కానీ చేయకుండా కాసేపు రిలాక్స్ అవ్వడం. ఇలా చేయడం వల్ల మీ శరీరం రిలాక్స్‌గా ఫీలై నిద్రకు ప్రేరేపిస్తుంది. మీకు నిద్ర ముంచుకొచ్చేవరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్లు చేయండి.
Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!
Also Read: కారులో సెక్స్ చేసిన మహిళకు రూ.40 కోట్లు పరిహారం, ఇదెక్కడి విడ్డూరం!