Men’s Health Problems : మగవారిలో ఆఫీస్ ఒత్తిడిని తగ్గించే ఆయుర్వేద చిట్కాలు.. బోర్డ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు
Ayurveda Tips for Stamina : పురుషుల్లో ఆఫీస్ ఒత్తిడిని, లైంగిక శక్తిని మెరుగుపరచుకునేందుకు ఆయుర్వేదంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్ని మూలికలు, చికిత్సలతో ఆ సమస్యలు ఎలా దూరం చేసుకోవచ్చో చూసేద్దాం.

Ayurvedic Remedies for Men : ఆధునిక జీవితం పురుషులపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది వారి ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. వర్కింగ్ సమయం ఎక్కువగా ఉండడం, క్లిష్టతరమైన టార్గెట్స్, డిజిటల్ కార్యకలాపాలు ఎక్కువగా చేయడం వల్ల శరీరం, మనస్సు ఎక్కువగా అలసిపోతున్నట్లు గుర్తించామని తెలిపారు ఆయుర్వేద నిపుణులు. ఈ ఒత్తిడి కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా.. వ్యక్తిగత సంబంధాలు, మొత్తం శ్రేయస్సును దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. విశ్రాంతి లేకపోవడం, ఆందోళన, లిబిడో తగ్గిపోవడం, లైంగిక సమస్యలు వంటివి వారిలో పెరిగిపోవడానికి ఇవి కారణమవుతున్నాయట. అందుకే బోర్డ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు ఉండే సమస్యలను ఆయుర్వేదం ద్వారా తగ్గించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
ఒత్తిడి-లైంగిక ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఇదే
దీర్ఘకాలిక ఒత్తిడి నాడీ వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, మానసిక అలసటను పెంచుతుందని షియోపాల్స్ వ్యవస్థాపకుడు, రచయిత శ్రీ మూల్ మీనా తెలిపారు. ఇవన్నీ వాతం పెరిగిన సంకేతాలని.. కాలక్రమేణా ఈ అసమతుల్యతలు లిబిడోను తగ్గిస్తాయని.. దీనివల్ల అంగస్తంభన లోపం జరుగుతుందంటున్నారు. పిత్తం పెరగడం వల్ల కూడా చికాకుగా ఉండడం, అకాల స్కలనం లేదా నిద్రకు భంగం వంటి సమస్యలను పెంచుతుందని చెప్తున్నారు.
జీవక్రియ, హార్మోన్లపై కూడా ప్రభావం చూపిస్తుందన్నారు. ఒత్తిడి జీర్ణశక్తిని కూడా బలహీనపరిచి... శరీరంలో టాక్సిన్లను (ఆమ) పెంచుతుందట. దీనివల్ల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగి... రోగనిరోధక శక్తి, భావోద్వేగ స్థిరత్వం, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. దీనివల్ల పురుషులు త్వరగా అలసిపోయినట్లు భావిస్తారని.. ఆ సమయంలో ఆఫీస్‌లోనే కాదు.. బెడ్ రూమ్‌లోనూ ఎఫెక్టివ్‌గా వర్క్ చేయలేకపోవచ్చని చెప్తున్నారు.
పురుషుల్లో సమస్యలను తగ్గించే ఆయుర్వేదం చికిత్సలు ఇవే
పురుషుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఆయుర్వేదం ప్రధాన కారణాలపై ఫోకస్ చేస్తుంది. స్థిరమైన పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. మనస్సును శాంతపరచడం నుంచి శరీరాన్ని డీటాక్స్ చేయడం వరకు శరీరంలో శక్తిని నింపడం నుంచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు హెల్ప్ చేస్తుంది. పురుషుల్లోని సమస్యలు దూరం చేసే ఆయుర్వేద మార్గాలేంటో చూసేద్దాం.
మసాజ్ : అభ్యంగ అంటే వెచ్చని నూనెతో మసాజ్ చేయడం. శిరోధార అంటే నుదుటిపై నుంచి మూలికా నూనెను నెమ్మదిగా పోయడం వంటి సాధారణ పద్ధతుల ద్వారా నాడీ వ్యవస్థను లోతుగా శాంతపరుస్తారు. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించేందుకు పంచకర్మ నిర్విషీకరణ చికిత్సలు చేస్తారు. ఇవి శరీరాన్ని శుభ్రపరిచి.. హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరిస్తాయి.
లైంగిక ఆరోగ్యానికి : అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి వంటివి కార్టిసోల్‌ను తగ్గించి.. స్టామినాను మెరుగుపరుస్తాయి. లైంగిక శక్తిని పునరుద్ధరించేందుకు ఇవి ప్రసిద్ధమైన ఆయుర్వేద నివారణలుగా చెప్తారు. బ్రాహ్మి, కపికచ్చు వంటివి కూడా మానసిక స్పష్టతను ఇచ్చి మూడ్ బ్యాలెన్స్‌కు మద్దతు ఇస్తాయట.
ఆహారంలో మార్పులు : ఆయుర్వేదం ప్రకారం వెచ్చని, పోషకాలతో ఫుడ్ తీసుకోవాలట. చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, దానిమ్మ, అత్తి పండ్లు వంటివి సంతానోత్పత్తికి సహాయపడతాయని చెప్తోంది ఆయుర్వేదం. పసుపు, జాజికాయ, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు ఒత్తిడిని తగ్గించడంలో మేలు చేస్తాయట. కెఫిన్, ఆల్కహాల్ తగ్గించేస్తే మంచి ఫలితాలు చూడవచ్చట.
లైఫ్స్టైల్లో మార్పులు : రోజూ యోగా, ధ్యానం చేస్తే నాణ్యమైన నిద్ర అంది.. ఒత్తిడి అదుపులో ఉంటుంది. శరీరం సహజంగానే సమతుల్యతను పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుందట. నడక లేదా యోగా భంగిమలు వంటి మితమైన వ్యాయామం కూడా రక్త ప్రసరణ పెంచి శరీరానికి శక్తిని అందిస్తుంది.
పురుషులు తమ లైఫ్స్టైల్లో ఈ చిన్నపాటి మార్పులు చేస్తే వారిలో అలసటను తగ్గించుకుని బోర్డ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించే పనులు చేస్తే మంచిదని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. పరిస్థితి చేజారినప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలంటున్నారు.






















