No Smoking Day : స్మోక్ చేయని వారిలో కూడా నికోటిన్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Non Smokers Health : స్మోకింగ్ అనేది ఎంతటి ప్రమాదకరమో తెలిపే సంఘటన ఇది. ఎందుకంటే ధూమపానం చేసేవారినే కాదు.. చేయనివారిని కూడా స్మోకింగ్ ఏవిధంగా ప్రభావితం చేస్తుందో.. ఓ అధ్యయనం తెలిపింది.
Smoking is Injurious to Health : ధూమపానం చేయకండి. చేయనివ్వకండి. అనేది ఎంత నిజమో తేల్చి చెప్పింది ఓ అధ్యయనం. సాధారణంగా స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి హానికరం. కానీ కొందరు స్టైల్ కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం.. స్నేహితుల బలవంతం మీద స్మోకింగ్ చేస్తారు. అది కాస్త వ్యసనంగా మారిపోతుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లకు, ప్రాణాంతకమైన వ్యాధులకు స్మోకింగ్ దారి తీస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా చాలామంది దానిని వదులుకోలేరు. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం స్మోకింగ్ ఎంత ప్రమాదకరమో అనే టాపిక్‌పై షాకింగ్ విషయాలు చెప్పింది.
స్మోకింగ్ అలవాటు లేకున్నా సరే..
పాసివ్ స్మోకింగ్ ద్వారా లక్షలాది మంది ధూమపానం చేయని వారి రక్తంలో నికోటిన్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ విషయం ఎక్కువమందికి తెలియట్లేదని కూడా గుర్తించారు. ఎందుకంటే స్మోకింగ్ అలవాటు లేకుండా నికోటిన్ శరీరంలోకి ఎలా వస్తుందనే భ్రమలోనే చాలామంది లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్లు తెలిపారు.పాసివ్ స్మోకింగ్ అనేది ధూమపానం చేయని వ్యక్తుల ఆరోగ్యంపై గణనీయమైన ప్రమాద హెచ్చరికలను సూచిస్తుంది.
పిల్లలు, గర్భిణీలపై కాస్త ఎక్కువ ప్రభావం
సిగరెట్ లేదా పొగాకు పొగలో ఉండే విష రసాయనాలు.. అటుగా వెళ్లేవారిపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ కెమికల్స్ శ్వాసకోశ సమస్యలు, హృదయ సంబంధ వ్యాధులు, వివిధ క్యాన్సర్లతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ సమస్య తీవ్రతను గుర్తిస్తూ.. పొగతాగే అలవాటును తగ్గించుకోవడానికి, ధూమపానం చేయని వారి ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలు చేస్తున్నారు. స్మోకింగ్‌పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఏటా మార్చి 13వ తారీఖున నో స్మోకింగ్ డే నిర్వహిస్తున్నారు.
రక్తంలో నికోటిన్ ఛాయలు
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ధూమపానం చేయనివారు పాసివ్ ధూమపానానికి గురైనప్పుడు.. వారు ధూమపానం చేసే వ్యక్తుల మాదిరిగానే నికోటిన్ అనే ప్రమాదకరమైన వాయువులను పీల్చుకుంటున్నారు. ఇది వారిలో ఆరోగ్యప్రమాదాలను కలిగిస్తుంది. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది రక్తంలో నికోటిన్‌ను గుర్తించారు. కాబ్టటి ధూమపానం చేయడమనేది ఎంతవరకు సమంజసమో.. స్మోక్ చేసే వారే గుర్తించాలి.
ప్రేమించే వారికోసం..
పొగాకును కాల్చడం ద్వారా విడుదలయ్యే విష రసాయనాలు త్వరగా గాలిలోకి చొచ్చుకుపోతాయి. ధూమపానం చేయనివారు ఆ రసాయానాలు పీల్చినప్పుడు వారు తీవ్రమైన అనారోగ్య పరిస్థితులకు గురవుతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారిని, మీరు ప్రేమించేవారిని అనారోగ్యాల బారిన పడేయకుండా ఉండేందుకు మీరు స్మోకింగ్ చేయడం మానేస్తే మంచిది అంటున్నారు నిపుణులు.
Also Read : రోజూ ఈ పనులు చేస్తే.. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు మీ సొంతమవుతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.