Cabbage: క్యాబేజీతో ఇలా ఊతప్పం చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది
Cabbage: ఒకే రకమైన టిఫిన్లతో విసిగిపోయేవారు... ఇలా క్యాబేజీతో ఊతప్పం చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.
Cabbage:క్యాబేజీ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయ. దీన్ని ఎప్పుడూ కూరగానో, వేపుడుగానో తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే ఒకసారి క్యాబేజీతో ఊతప్పం చేసుకుని తినండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా... బోరు కొట్టిన వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ గా ఇలా క్యాబేజీ ఊతప్పం ప్రయత్నించండి. సాయంత్రం పూట స్నాక్స్ గా కూడా దీన్ని తినవచ్చు. ఊతప్పం తయారు చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం.
కావలసిన పదార్థాలు
క్యాబేజీ - పావు కిలో
పసుపు - చిటికెడు
కారం - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
గరం మసాలా - పావు స్పూను
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
బియ్యప్పిండి - రెండు స్పూన్లు
గోధుమపిండి - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
తయారీ ఇలా
క్యాబేజీని తరిగి ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేయాలి. మరీ పేస్టులా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఈ క్యాబేజీ తరుగును ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర, బియ్యప్పిండి, గోధుమపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు పక్కన పెడితే క్యాబేజీలోంచి కాస్త నీరు దిగుతుంది. అప్పుడు అవసరమైతే మరి కొంచెం పిండిని కలుపుకోవచ్చు. దీనికి నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి నూనె రాయాలి. ఈ క్యాబేజీ మిశ్రమాన్ని ఉండలా చుట్టి తీసుకొని దానిపై పెట్టి ఊతప్పం లాగా చేతితోనే ఒత్తుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఈ ఊతప్పాన్ని తీసి దానిపై వేసి కాల్చాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారేవరకు కాల్చుకోవాలి. అంతే రుచిగా ఉండే క్యాబేజీ ఊతప్పం రెడీ అయినట్టే. దీన్ని టమాటో కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కెచప్ ఇష్టం లేని వాళ్ళు క్యాబేజీ ఊతప్పం ఒక్కటి తిన్నా రుచిగానే ఉంటుంది.
క్యాబేజీని తినడం వల్ల అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కంటి శుక్లాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. దీనిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల పొట్ట మంట తగ్గుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి మధుమేహులు కచ్చితంగా క్యాబేజీ వంటకాలను ఎక్కువగా తినాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.