ప్రొటీన్ పొడిని ఇలా ఇంట్లోనే తయారుచేసుకోండి, రోజూ తాగితే ఎంతో బలం
ప్రొటీన్ షేక్‌లు తాగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. దాని వల్ల కండపుష్టి కోసం దీన్ని తాగుతారు.
జిమ్‌కెళ్లేవారి ప్రతి బ్యాగులో ప్రొటీన్ షేక్ బాటిల్ కచ్చితంగా ఉంటుంది. కండ పుష్టి కోసం దీన్ని తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే వీటి రేట్లు మార్కెట్లో మామూలుగా లేవు. అలాగే వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ప్రొటీన్ పొడి కన్నా ఇంట్లో తయారుచేసుకుని వాడుకోవడం మంచిది. ఇది తాజాగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారుచేసుకోవచ్చు.
ఏమేం కావాలి?
గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, పుచ్చగింజలు, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు... వీటిని విడి విడిగా కొనుక్కోవాలి. వేటికి తడి తగలకుండా చూసుకోవాలి. ఈ పప్పులన్నింటినీ సమపాళ్లలో తీసుకోవాలి. ఈ పప్పులను విడి విడిగా కళాయిలో (నూనె వేయకూడదు) వేయించుకోవాలి. కాస్త దోరగా వేగాక తీసేయాలి. అన్నీ వేయించుకున్నాక అన్నింటినీ చల్లరనివ్వాలి. తరువాత వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేయాలి. ఎండు ఖర్జూరాలను లోపల విత్తనం తీసేసి ముక్కలుగా చేసి అందులో వేయాలి. తీపిదనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సాధారణంగా ఉంటే చాలు అనుకుంటే ఓ అయిదు నుంచి ఆరు వేసుకుంటే చాలు. అన్నింటినీ కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. మంచి సువాసన కావాలంటే రెండు యాలకులు కూడా వేసుకోవచ్చు. ఈ పొడిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టేయాలి. గాలి తగలనివ్వకూడదు. గాలి తగిలితే పురుగు చేరుతుంది.
ఎలా తాగాలి?
పాలల్లో హార్లిక్స్ వంటివి ఎలా కలుపుకుని తాగుతారో అలాగే దీన్ని ఒకటి లేదా రెండు స్పూన్లు వేసుకుని కలుపుకుని తాగేయడమే. పిల్లలకు తాగిస్తే చాలా మంచిది. తెలివి తేటలు బాగా పెరుగుతాయి. బలంగా, పుష్టిగా కూడా తయారవుతారు. బయట మార్కెట్లో దొరికే పొడుల కన్నా ఇంట్లో చేసిన ఈ ప్రొటీన్ పొడి చాలా మేలు చేస్తుంది.
ప్రొటీన్స్ ఎందుకు?
ఇంటికి ఇటుక, సిమెంట్ ఎంత ముఖ్యమో, మన శరీరానికి ప్రొటీన్ అంత ముఖ్యం. శరీరంలోని ప్రతి కణానికి ప్రొటీన్ అత్యవసరం. మనం రోజువారీ కార్యకలాపాలకు ఇది కావాలి. ప్రొటీన్ అమినో ఆమ్లాలతో కలిసి ఉంటుంది. పెరుగుతున్న పిల్లలకు ఈ అమినో ఆమ్లాలు చాలా అవసరం. మన చర్మం, జుట్టు, గోర్లు, కండరాలు, ఎముకలు అన్నింటి పెరుగుదలకు ఆరోగ్యానికి ప్రొటీన్ అవసరం కాబట్టి ఆ పోషకం అధికంగా ఉండే ఆహారం తినడం ముఖ్యం.
ఇతర ఆహారపదార్థాలు
1. చికెన్
2. గుడ్డులోని పచ్చసొన
3. సాల్మన్, టూనా చేపలు
4. పీనట్ బటర్
5. కిడ్నీ బీన్స్, బఠాణీలు, చిక్కుళ్లు
6. కొమ్ము శెనగలు
7. సోయా
Also read: క్రిస్పీగా బూడిద గుమ్మడికాయ వడియాలు - ఇలా పెట్టుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.