Recipes: క్రిస్పీగా బూడిద గుమ్మడికాయ వడియాలు - ఇలా పెట్టుకోండి
సాంబారులో బూడిద గుమ్మడి కాయల వడియాలు తింటే ఆ రుచే వేరు.
ఎప్పుడో అమ్మమ్మలు బూడిద గుమ్మడి కాయ వడియాలు పెట్టి పంపిస్తే వేయించుకుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు వీటిని చేసే వాళ్లు చాలా తక్కువైపోయారు. మార్కెట్లో అమ్ముతున్నా అధిక ధరలకు లభిస్తున్నాయి. అదే ఇంట్లోనే చేసుకుంటే ఒక గుమ్మడికాయతో కిలో వడియాలు పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ వడియాలు ఏడాది పాటూ నిల్వ ఉంటాయి. పురుగుపడుతుందన్న భయం కూడా లేదు. అప్పడాల్లాగే చాలా కాలం పాటూ తాజాగా ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు
బూడిద గుమ్మడి కాయ - ఒకటి
(మీడియం సైజు)
పసుపు - రెండు టీస్పూన్లు
జీలకర్ర - ఒక టీస్పూను
మినపప్పు - పావు కిలో
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - ఏడు
తయారీ ఇలా
1. బూడిద గుమ్మడికాయకు బూడిదలాంటి పొడి బాగా అంటుకుని ఉంటుంది.దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.
2. పైన తొక్క, గింజలు తీయకుండా అలాగే చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
3. ఆ ముక్కలను గిన్నెలో వేసి పైన ఉప్పుడు, పసుపు కలిపి ఒక గంట పాటూ ఊరబెట్టాలి. అందులో నీళ్లు దిగుతాయి.
4. నీరంతా వడకట్టేందుకు ముక్కలన్నీ ఒక వస్త్రంలో చుట్టి పిండాలి.
5. దాని మూటలా కట్టుకోవాలి. ఆ మూటను అలాగే రాత్రంతా ఉంచాలి.
6. మరో పక్క మినప్పప్పును కూడా రాత్రంతా నానబెట్టుకోవాలి.
7. ఉదయం పచ్చి మిర్చి, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి.
8. అలాగే మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
9. ఇప్పుడు ఒక గిన్నెలో రాత్రి మూట కట్టుకున్న గుమ్మడి వడియాలు, మినపప్పు రుబ్బు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
10. గుమ్మడి ముక్కలు చాలా మెత్తగా నానిపోతాయి కాబట్టి వాటిని రుబ్బాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకోవాలి.
11. ఇప్పుడు ఎర్రటి ఎండలో పలుచటి వస్త్రంపై వడియాల్లా పెట్టుకోవాలి.
12. రెండు నుండి మూడు రోజల పాటూ ఎండితే చాలా వడియాలు రెడీ.
13. వీటిని నూనెతో వేయించుకుని పప్పు లేదా సాంబారుతో తింటే కరకరలాడుతాయి.
బూడిద గుమ్మడికాయతో లాభాలు
బూడిద గుమ్మడి కాయను ఇంటికి దిష్టి తీసే వస్తువుగానే చూస్తారు కానీ, ఆహారంగా చూసే వాళ్లు చాలా తక్కువ మంది. పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ దీన్ని తినేవారు తక్కువ. ఎవరో దీన్ని పులుసులో ముక్కలుగా వేసుకుంటారు. అలా కూడా తినడం ఇష్టం లేని వారు ఇలా వడియాల రూపంలో తినవచ్చు. బూడిద గుమ్మడికాయ తినడం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, దాహం అతిగా వేయడం వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్య కూడా చాలా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం దీన్ిన తినడం వల్ల హైబీపీ, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. దీనిలో నీరే అధిక శాతం ఉంటుంది కాబట్టి కూరల్లో ముక్కలుగా కోసం వండుకుంటే మంచి డైటింగ్ ఆహారంగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గుతారు. దీంతో చేసే పెరుగు పచ్చడిని తిన్నా మంచిదే. ఏదో రకంగా బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగం చేసుకోండి.
Also read: ఊపిరితిత్తుల్లో కఫం పట్టేసిందా? ఒకసారి ఈ చిట్కాల పాటించి చూడండి