Makar Sankranti Festival 2025 : మకర సంక్రాంతి 2025 తేది.. ఈ పండుగ చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
Sankranti Festival History : శీతాకాలం ముగింపును సూచిస్తూ భారతదేశంలో జరుపుకునే ప్రధాన పండుగ మకర సంక్రాంతి. దీని చరిత్ర, ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
Makar Sankranti 2025 History and Significance : భారతదేశంలో హిందువులు జరుపుకొనే అత్యంత ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. శీతకాలం ముగింపును సూచిస్తూ.. కొత్త పంటల రాకకు గుర్తుగా దీనిని చేసుకుంటారు. అలాగే సూర్యభగవానుడి పండుగగా చెప్తారు. ఈ పండుగ వెనుక అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో కథలతో, అంశాలతో ఈ పండుగ భారతదేశ ప్రజలతో అనుబంధం కలిగి ఉంది.
మకర సంక్రాంతి 2025 తేది
సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తూ.. మకర సంక్రాంతి అని పిలుస్తారు. 2025లో మకర సంక్రాంతి జనవరి 14వ తేదీన మంగళవారం వచ్చింది. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరంవైపు వెళ్తాడు కాబట్టి.. దీనిని ఉత్తరాయణం అంటారు. ఈ సమయాన్ని చాలా పవిత్రమైనదిగా చెప్తారు. మకర సంక్రాంతి సూర్య భగవానుడి పండుగ అయినా.. చంద్ర క్యాలెండర్ ప్రకారం దీనిని జరపుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతి అదే రోజున వస్తుంది. మకర సంక్రాంతి రాకతో సూర్యరశ్మి ప్రకాశిస్తుందని.. శీతాకాలపు గాలి తగ్గుతుందని చెప్తారు.
మకర సంక్రాంతి 2025 చరిత్ర ఇదే
హిందూ పురాణాల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. ఖగోళ శాస్త్రంలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి.. మకర రాశికి మారడాన్ని ఖగోళ శాస్త్రం గుర్తుచేస్తుంది. పురణాల ప్రకారం అయితే.. సూర్యదేవుడు మకరానికి అధిపతి అయిన తన కొడుకు శనిని సందర్శిస్తాడని.. అందుకే దీనిని మకర సంక్రాంతి అని అంటారు. అంతేకాకుండా తండ్రి, కొడుకుల మధ్య బంధాన్ని ఇది తెలియజేస్తుంది.
ఈ సంక్రాంతి పండుగ నుంచి పగలు సమయం ఎక్కువగా.. రాత్రి తక్కువగా ఉంటుంది. ఇది వింటర్ ముగింపును సూచిస్తుంది. చలికాలం నుంచి, చల్లగాలుల నుంచి ఉపశమనం అంది.. రాత్రుళ్లు సైతం వేడి ప్రారంభమవుతుందని చెప్తారు.
Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్‌గా ఉంటాయి
మకర సంక్రాంతి 2025 ప్రాముఖ్యత
దేశం అంతటా మకర సంక్రాంతిని గొప్పగా జరుపుకుంటారు. ప్రతి ప్రాంతంలో దానికి ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో గాలిపటాలు, నోరూరించే వంటకాలు, భోగిమంటలతో జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పిండివంటలు, కోడి పందాలతో సమయాన్ని గడిపేవారు కూడా ఉన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పతంగులు ఎగురవేస్తారు. మరికొందరు గంగానది వంటి పవిత్ర నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. సూర్యదేవునికి పూజలు చేస్తారు. చలిని దూరం చేసే భోగిమంటలతో ప్రారంభమయ్యే ఈ పండగను.. కనుమతో ముగిస్తారు.
ఆత్మను శుద్ధి చేసుకోవడానికి.. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు గంగా, యమునా నది వంటి పవిత్ర నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఇప్పుడు మహా కుంభ మేళ 2025 కూడా పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.
Also Read : సంక్రాంతి శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విష్ చేసేయండిలా