Sankranti 2025 Recipes : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్‌గా ఉంటాయి
Makar Sankranti 2025 Special Recipes : సంక్రాంతి అంటే పిండివంటలు ఉండాల్సిందే. అప్పటికప్పుడు చేసుకునేలా కాకుండా.. ముందుగా తయారు చేసుకుని రెండు వారాలైనా ఫ్రెష్‌గా ఉండే లడ్డూల రెసిపీ చూసేద్దాం.
Sankranti 2025 Special Laddu Recipe : సంక్రాంతి 2025 వచ్చేసింది. ఈ సమయంలో పిండివంటలు లేకుంటే అసలు పండుగ వాతావరణమే ఉండదు. ముఖ్యంగా స్వీట్స్ ఇష్టపడేవారికి లడ్డూలు కచ్చితంగా ఉండాలి. పండుగ సమయంలోనే కాకుండా.. పండుగ తర్వాత కూడా ఫ్రెష్ రుచిని ఇచ్చే లడ్డూల రెసిపీ ఇక్కడుంది. మరి ఈ టేస్టీ, జ్యూసీ లడ్డూలను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే లడ్డూలు మంచిగా వస్తాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పంచదార - ఒకటిన్నర కేజీలు
నీళ్లు - 700 మి.లీటర్లు
శనగపిండి - అర కిలో
నీళ్లు - పిండి కలుపుకోవడానికి సరిపడేంత
జీడిపప్పు - అరకప్పు
కిస్మిస్ - పావు కప్పు
యాలకులు - అర టీస్పూన్
తినే కర్పూరం - చిటికెడు
తయారీ విధానం
ముందుగా లడ్డూల కోసం శనగపిండిని బాగా జల్లించుకోవాలి. ఈ పిండిలో తగినంత నీళ్లు పోసుకోవాలి. పిండిని జారుగా కలుపుకోవాలి. పిండి బాగా చిక్కగా, మరీ పలుచగా ఉండకుండా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఓ వెడల్పాటి మూకుడు లేదా కడాయి తీసుకోవాలి. దానిలో ఒకటిన్నర కేజీల పంచదార వేసుకోవాలి. అంటే శనగపిండికి మూడురెట్లు ఎక్కువగా పంచదార ఉండాలి.
అరకిలో శనగపిండి తీసుకుంటే.. కిలోన్నర పంచదార తీసుకోవాలి. మీరు పిండిని తీసుకునే క్వాంటిటీని బట్టి పంచాదర క్వాంటిటీ మారుతుంది. ఇప్పుడు ఈ పంచదార కడాయిని స్టౌవ్‌పై పెట్టి స్టౌవ్‌ని వెలిగించాలి. పంచదారలో నీళ్లు వేసి.. పంచదార కరిగి లేతపాకం వచ్చేవరకు కలుపుకోవాలి. పంచదార కరిగి.. మరిగేటప్పుడు.. పాకంపై తేలే తెల్లని తేటను తీసేయాలి. పాకం తీగ మాదిరి వచ్చిందంటే చాలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో కడాయి తీసుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అది పూర్తిగా కాగిన తర్వాత బూందీ గరిటె సహాయంతో.. ముందుగా కలిపి పెట్టుకున్న పెండిని వేసి.. బూందీ చేసుకోవాలి. బూందీ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఈ వేయించుకున్న బూందీని పాకంలో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా వేసిన బూందీ మొత్తాన్ని.. షుగర్ సిరప్‌లో బాగా కలిపి.. అలా పక్కన ఉంచాలి. కాసేపటికి బూందీ పాకాన్ని పీల్చుకుంటుంది.
ఇప్పుడు పాకంతో నిండిన బూందీని ఓ జల్లెడలో వేస్తే.. పాకం ఎక్కువగా ఉండేది కిందకి వెళ్లిపోతుంది. ఆ బూందీని ఓ పల్లెలంలోకి తీసుకుని.. దానిలో జీడిపప్పు, కిస్మిస్, చిటికెడు పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసుకోవాలి. వీటన్నింటీని బాగా కలిపి.. లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రసాలూరే లడ్డూలు రెడీ. ఇవి రెండు వారాలు దాటినా ఫ్రెష్‌గా ఉంటాయి. స్వీట్స్‌ని ఇష్టపడేవారికి, పండుగ సమయంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇచ్చుకోవడానికి కూడా ఈ రెసిపీ హెల్ప్ చేస్తుంది. పండుగకు ఓ మూడు రోజుల ముందే వీటిని చేసుకున్నా.. పండుగ సమయానికి హడావుడి లేకుండా ప్రశాంతంగా లడ్డూలు ఎంజాయ్ చేయవచ్చు.
Also Read : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే